పోలీసులు నన్ను చితక్కొట్టారు - యూట్యూబర్ నాని
పోలీసులు తనను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారని, తన ఫోన్ తీసుకున్నారని, వాచ్ తీసుకున్నారని, మొలతాడు తీసేయించారన్నారు నాని.
వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు తగలబడిన ఘటనలో యూట్యూబర్ నాని ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చాడు. అతడిని అరెస్ట్ చేసినట్టు అధికారిక సమాచారం లేకపోవడం, నాని కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సడన్ గా నాని బయటకు వచ్చారు. ఘటన జరిగిన రోజు తనను పోలీసులు తీసుకెళ్లారని లాఠీలతో కొట్టారని వివరించారు. తనను బూతులు తిట్టారని, ఎందుకు ఇలాంటి పని చేశావని అడిగారని చెప్పారు నాని. చివరకు కోర్టులో పిటిషన్ వేయడంతో తనను వదిలిపెట్టారని అన్నారు. మీడియా ముందుకు రావొద్దని, ఎవరితోనూ మాట్లాడొద్దని హెచ్చరించారని అన్నారు నాని.
ఫిషింగ్ హార్బర్ లో తాను పార్టీ ఇవ్వలేదని, హోటల్ రూమ్ లో పార్టీ జరిగిందని చెప్పారు యూట్యూబర్ నాని. వరల్డ్ కప్ ఫైనల్ చూస్తూ పార్టీ చేసుకున్నామని అన్నారు. హార్బర్ లో అగ్ని ప్రమాదం జరిగిందని తనకు ఫోన్ వస్తే.. హడావిడిగా హోటల్ నుంచి బయటకు వచ్చానని, అప్పటికి తాను ఆల్కహాల్ తీసుకున్నానని, అగ్నిప్రమాదానికి తనకు సంబంధం లేదన్నారు. తాను వీడియో తీసి ఆ ఘటనను బయటి ప్రపంచానికి తెలియజేయాలనుకున్నానని వివరించారు. సహాయక చర్యల్లో కూడా పాల్గొన్నానని వివరించారు.
పోలీసులు తనను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారని, తన ఫోన్ తీసుకున్నారని, వాచ్ తీసుకున్నారని, మొలతాడు తీసేయించారన్నారు నాని. పోలీసులు తనను 4రోజులపాటు విచారించారని, తనతోపాటు నలుగురు కుర్రాళ్లను కూడా తీసుకెళ్లారని.. వారిని ఏం చేశారో తెలియదన్నారు నాని.వారిని కూడా బుక్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకు న్యాయం జరగాలని అన్నారు. తన తరపున లాయర్ పిటిషన్ వేయకపోతే ఇప్పటికి కూడా బయటకు వదిలిపెట్టేవారు కాదని వాపోయారు నాని.
తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పారు లోకల్ బాయ్ నాని. తనకు కొన్ని పార్టీలతో సంబంధం ఉందని వార్తలొస్తున్నాయని, ఆ వార్తల్లో నిజం లేదన్నారు. మీడియా తనపై తప్పుడు కథనాలిచ్చిందన్నారు. కొన్ని ఛానెళ్లు తప్పుడు ఆరోపణలు చేశాయని, తనని నిందితుడుగా చూపించాయన్నారు.
♦