Telugu Global
Andhra Pradesh

గుట్టలపై నుంచి పడిన యువతి, 12 గంటల పాటు నరకయాతన..

చుట్టూ చిమ్మచీకటి, జనసంచారం లేకపోవడంతో ఆమె రాత్రంతా నరకయాతన అనుభవిస్తూ మృత్యువుతో పోరాడింది. సోమవారం బీచ్‌కు వచ్చిన కొందరు ఆమెను గుర్తించి బయటకు తీశారు.

గుట్టలపై నుంచి పడిన యువతి, 12 గంటల పాటు నరకయాతన..
X

స్నేహితుడితో కలిసి గుట్టలపైకి ఎక్కిన ఓ యువతి ప్రమాదవశాత్తు రాళ్ల‌ మధ్య ఇరుక్కుపోయింది. భయంతో ఆ యువకుడు పరారవ్వ‌డంతో సాయం చేసేవారు లేక ఆమె దాదాపు 12 గంటల పాటు నరకయాతన అనుభవించింది. మరుసటి రోజు ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు వ్యక్తులు యువతిని చూసి అతి కష్టం మీద ఆమెను బయటకు తీసిన సంఘటన విశాఖ నగర శివారులోని అప్పికొండ సాగర తీరంలో జ‌రిగింది.

పూర్తి వివరాలలోకి వెళితే ..

కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి, భీమవరానికి చెందిన వర్మరాజు అనే యువకుడితో కలిసి సెప్టెంబర్ 29న విశాఖపట్నం వచ్చింది. వేర్వేరు ప్రాంతాల్లో రెండు మూడు రోజులపాటు తిరిగిన వీరిద్దరూ అక్టోబర్ 2వ తేదీ నుంచి అప్పికొండ సముద్ర తీరంలో ఉన్న కొండపై ఉంటున్నారు. అయితే అనుకోకుండా ఆమె ఆదివారం సాయంత్రం కొండపైనుంచి పడిపోయింది. కంగారు పడిపోయిన వర్మరాజు ఆమెను పైకి తియ్యటానికి ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో ఏం చెయ్యాలో తెలియక అంబులెన్స్ తీసుకువస్తానంటూ ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు.

చుట్టూ చిమ్మచీకటి, జనసంచారం లేకపోవడంతో ఆమె రాత్రంతా నరకయాతన అనుభవిస్తూ మృత్యువుతో పోరాడింది. సోమవారం బీచ్‌కు వచ్చిన కొందరు ఆమెను గుర్తించి బయటకు తీశారు. మత్స్యకారులు, స్థానిక యువకులు డోలీల సాయంతో అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. యువతికాళ్లకు తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. అయితే, కొండ అంచులో నిలబడి సముద్రాన్ని చూస్తున్న క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయినట్లు బాధితురాలు చెబుతోంది. పరారీలో ఉన్న యువకుడి తప్పు ఏమి లేదని ఆమె పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం.

అయితే పోలీసులు మాత్రం ప్రమాదం తర్వాత అమ్మాయి వద్ద ఉన్న డబ్బులు, బంగారం తీసుకుని ప్రియుడు పారిపోయినట్లు చెబుతున్నారు. ఈ మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంబులెన్స్ సిబ్బంది యువతి తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె విశాఖకు బయలుదేరారు. కుమార్తె కనబడకపోవడంతో తాము వారం క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలి త‌ల్లి చెబుతున్నారు.

First Published:  10 Oct 2023 3:46 PM IST
Next Story