వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తే పీడ పోతుంది - వైసీపీ ఎమ్మెల్యే
వీఆర్వోలను సచివాలయాల్లో కార్యదర్శిలుగా, వీఆర్ఏలను ఇతర శాఖల్లో అటెండర్లుగా నియమిస్తే సరిపోతుందన్నారు. వీఆర్ఏ, వీఆర్వోలు అవినీతికి చిహ్నాలుగా మారారని ఆరోపించారు.
ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తే ప్రజలకు పట్టిన పీడ పోతుంది అని వ్యాఖ్యానించారు .
వీఆర్వోలను సచివాలయాల్లో కార్యదర్శిలుగా, వీఆర్ఏలను ఇతర శాఖల్లో అటెండర్లుగా నియమిస్తే సరిపోతుందన్నారు. వీఆర్ఏ, వీఆర్వోలు అవినీతికి చిహ్నాలుగా మారారని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగులు కూడా వారి ఇష్టానికి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. వీఆర్ఏ వ్యవస్థ బ్రిటిష్ కాలం నుంచి వస్తోందని ఇప్పుడు దాని అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే వీఆర్ఓ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. వీఆర్వోలు గ్రామాల్లో రైతుల నుంచి ప్రజల నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేస్తూ వారిని పట్టిపీడిస్తున్నారని ఆరోపణలు రావడంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేసింది. వీఆర్వోల కారణంగానే రెవెన్యూ రికార్డులు భారీ ఎత్తున తారుమారైనట్టుగా కూడా టీఎస్ ప్రభుత్వం అప్పట్లో గుర్తించింది. దాంతోనే ఆ వ్యవస్థనే రద్దు చేసేసింది. ఇప్పుడు ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కూడా అదే తరహా డిమాండ్ చేయడం చర్చనీయాంశం అయింది.