పవన్‌పై ఎల్లో మీడియా మొదలుపెట్టేసిందా?
ప్రజాజీవితంలో ఉన్నవారు నోటిని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఎల్లో మీడియా తన విశ్లేషణలో పవన్ను ఆక్షేపించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులే అధికార పక్షాలకు ఆయుధాలు ఇస్తున్నారా అంటు పవన్ను ఉద్దేశించి అసహనం వ్యక్తం చేసింది.

చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఉన్నంతకాలమే, ఉపయోగపడతారని అనుకున్నంత వరకే ఎవరినైనా ఎల్లో మీడియా మోస్తుంది. అలాకాకుండా ఎదురుతిరుగుతున్నారని అనుమానించినా, నష్టం చేస్తారని అనిపించినా వెంటనే ప్లేటు ఫిరాయించేస్తుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో ఎల్లో మీడియాకు ఇలాంటి అనుమానమే మొదలైనట్లుంది. అందుకనే పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు మొదలుపెట్టేసింది. ప్రతి ఆదివారం కొత్తపలుకు పేరుతో వచ్చే విశ్లేషణలో పవన్‌పై నెగిటివ్ రాతలు మొదలైంది.
వలంటీర్ల మీద పవన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్ల వల్లే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందన్న పవన్ ఆరోపణలపై వలంటీర్లు భగ్గుమన్నారు. నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు+సచివాలయ ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎల్లో మీడియా తన విశ్లేషణలో ప్రజాజీవితంలో ఉన్నవారు నోటిని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని పవన్ను ఆక్షేపించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులే అధికార పక్షాలకు ఆయుధాలు ఇస్తున్నారా అంటు పవన్ను ఉద్దేశించి అసహనం వ్యక్తం చేసింది.
పవన్ నోరుజారి అన్నమాటలను పట్టుకుని వలంటీర్లు అధికార వైసీపీతో కలిసి ఆందోళనలు చేయటం ఏమిటంటు మండిపడింది. వలంటీర్ల వ్యవస్థపై నెగిటివ్‌గా మాట్లాడేందుకు ప్రతిపక్షాలు భయపడుతున్నాయని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వలంటీర్ల వ్యవస్థ నడుము విరగొడతామని, వ్యవస్థను రద్దు చేస్తామని పవన్, చెప్పులతో కొట్టేవాళ్ళు లేక వలంటీర్లు ఇళ్ళల్లోకి చొరబడుతున్నారని చంద్రబాబు అనటాన్ని ఏమంటారు? వలంటీర్లు కొంపలను కూల్చేస్తున్నారని చంద్రబాబు రెచ్చగొట్టే మాటలను ఏమంటారో ఎల్లో మీడియానే చెప్పాలి. పవన్ చేసిన వ్యాఖ్యలతో వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు టీడీపీకి కూడా ఎక్కడ నెగిటివ్‌గా పనిచేస్తారో అన్న భయమే కనబడుతోంది.
వలంటీర్లకు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అయితే ఎల్లో మీడియా కేవలం పవన్ వ్యాఖ్యలను మాత్రమే హైలైట్ చేసింది. ఎందుకంటే పవన్ వ్యాఖ్యలతో పొత్తు పెట్టుకోబోతున్న టీడీపీకి కూడా నష్టం జరుగుతుందని ఎల్లో మీడియాలో టెన్షన్ మొదలైనట్లుంది. అందుకనే వలంటీర్ల మీద పవన్ వ్యాఖ్యలతో టీడీపీకి ఏమీ సంబంధంలేదన్నట్లుగా పెద్ద కథనమే వండివార్చింది. మరో నాలుగు రోజుల తర్వాత వలంటీర్లపై పవన్ ఇలాగే మాట్లాడి, వాళ్ళూ ఆందోళనలు చేస్తుంటే పవన్‌కు వ్యతిరేకంగా ఎల్లో మీడియాలో కథనాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు.