Telugu Global
Andhra Pradesh

పవన్‌పై డోస్‌ పెరుగుతోందా?

పవన్ నాలుగుళ్ళుగా బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నారన్న విషయాన్ని విశ్లేషకుడు మరచిపోయారు. పవన్‌కి క్రెడిబులిటి లేదని తెలిసినా మరింతకాలం ఎందుకు ప్రశ్నించలేదు?

పవన్‌పై డోస్‌ పెరుగుతోందా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఎల్లో మీడియా వ్యతిరేకంగా డోసు పెంచుతోంది. మారిన పవన్ వైఖరి వల్ల ఎల్లో మీడియా తమ డోసును పెంచుతోంది. ఆ పెంచుతున్న డోసుకు రెండు కారణాలు కనబడుతున్నాయి. మొదటిదేమో చంద్రబాబునాయుడు నుండి పవన్ దూరంగా జరుగుతున్నారని. ఇక రెండోదేమో బీజేపీతోనే ఉంటారనే అనుమానం పెరిగిపోతుండటం. ఈ రెండు అనుమానాలతో పవన్‌కు వ్యతిరేకంగా చర్చలు మొదలైపోయాయి.

ఎల్లో మీడియాకు మూడు, నాలుగు చానళ్ళున్నాయి. వీటిల్లో రెగ్యులర్‌గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆస్థాన విధ్వాంసులను పిలిపించి ప్రతి రోజూ తిట్టించటమే ఎల్లో మీడియా పని. తమ చానళ్ళల్లో నిర్వహిస్తున్న డిబేట్లను జనాలు ఎంత మంది చూస్తున్నారు, చూస్తున్నవాళ్ళల్లో ఎంత మంది నమ్ముతున్నారు అన్నది యాజమాన్యలకు అవసరంలేదు. ఎందుకంటే ఒకసారి కాకపోతే మరోసారైనా తమ డిబేట్లను జనాలు పట్టించుకోకుండా ఉంటారా, నమ్మకపోతారా అని పదేపదే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి.

అలాంటి ఒక చానల్లో తాజాగా జరిగిన డిబేట్లో పవన్ విశ్వసనీయతనే ప్రశ్నించారు. పవన్‌కు అసలు ఏమాత్రం క్రెడిబులిటి లేదని తేల్చేశారు. నాలుగేళ్ళుగా బీజేపీకి పవన్ మిత్రపక్షంగా ఉన్నప్పుడు లేని అభ్యంతరం సడెన్‌గా ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే చంద్రబాబుతో కాకుండా పవన్ బీజేపీతోనే ఎన్నికలకు వెళతారనే సమాచారం ఉందేమో. అందుకనే ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో పవన్ అంటకాగటం ఏమిటంటూ విశ్లేషకుడు మండిపోయారు. విభజన హామీలపై ఒకప్పుడు బీజేపీని నిలదీసిన పవన్ ఇప్పుడు ఎన్డీఏతో నడవటంతో జనాల్లో ఏమైనా క్రెడిబులిటి ఉంటుందా అని అడగటమే విచిత్రంగా ఉంది. ఏపీని బీజేపీ సర్వనాశనం చేస్తున్నా పవన్ ఎందుకు నిలదీయలేదని విశ్లేషకుడు నిలదీయటమే ఆశ్చర్యంగా ఉంది.

పవన్ నాలుగుళ్ళుగా బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నారన్న విషయాన్ని విశ్లేషకుడు మరచిపోయారు. పవన్‌కి క్రెడిబులిటి లేదని తెలిసినా మరింతకాలం ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే టీడీపీ+జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని అనుకున్నారు. అందుకనే పవన్‌లోని లోపాలను, క్రెడిబులిటిని ఎల్లో మీడియా ప్రశ్నించలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నుండి దూరం జరుగుతున్నారన్న అనుమానం మొదలైందో వెంటనే పవన్‌కు క్రెడిబులిటి లేదని గుర్తుకొచ్చింది. బీజేపీతోనే పవన్ ఎన్నికలకు వెళ్తార‌ని కన్ఫర్మ్ అయితే అప్పుడు పవ‌న్‌పై ఇంకెంత బురద చ‌ల్లుతారో చూడాలి.

First Published:  23 July 2023 10:26 AM IST
Next Story