Telugu Global
Andhra Pradesh

ఒకే విషయం ఆయనకు జరిగితే అవమానం.. ఈయనకు జరిగితే సన్మానం

జగన్ కు అపాయిట్మెంట్ ఇచ్చింది 15 నిమిషాలే అయినా గంటసేపు మాట్లాడినట్లు ఢిల్లీ మీడియా చెప్పింది. గంటసేపు మాట్లాడుకున్నాక అందులో రాజకీయాలు కూడా ఉండే ఉంటాయ‌నటంలో సందేహంలేదు.

ఒకే విషయం ఆయనకు జరిగితే అవమానం.. ఈయనకు జరిగితే సన్మానం
X

జగన్మోహన్ రెడ్డి ఏమిచేసినా, చేయకపోయినా ఏడుపే అన్నట్లుగా తయారైంది ఎల్లోమీడియా వ్యవహారం. ఎంత అవసరం వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రారని ఎల్లోమీడియా కొన్ని వందల సార్లు రాసింది. తాజాగా ఢిల్లీకి వెళ్ళి నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులను కలిస్తే ఇప్పుడు కూడా ఏడుస్తోంది. కారణం ఏమిటంటే.. గంటకుపైగా నిరీక్షించిన తర్వాత మోడీ 15 నిమిషాలు మాత్రమే జగన్ తో మాట్లాడారట. రాజకీయాలు మాట్లాడటానికి మోడీ అసలు జగన్ కు అవకాశ‌మే ఇవ్వలేదట.

అపాయిట్మెంట్ అడుగుతున్నా అమిత్ షా పట్టించుకోలేదట. నిరాశతో జగన్ వెనక్కు వచ్చేశారట. మీడియాతో కూడా మాట్లాడలేదు కాబట్టి జగన్ కు ఢిల్లీలో అవమానం జరిగిందని సంతోషపడుతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ఢిల్లీలో జగన్ కు అవమానం జరగాలని ఎల్లోమీడియా చాలా బలంగా కోరుకుంటోంది. అయితే అందుకు భిన్నంగా జరుగుతోంది ప్రతిసారి. అందుకనే జగన్ హవాను తట్టుకోలేక పూర్తిగా రివర్సులో కథనాలు అచ్చేస్తోంది. మోడీ-జగన్ మధ్య భేటీ దాదాపు గంటసేపు జరిగినట్లు మెజారిటీ మీడియా చెప్పింది.

జగన్ కు అపాయిట్మెంట్ ఇచ్చింది 15 నిమిషాలే అయినా గంటసేపు మాట్లాడినట్లు ఢిల్లీ మీడియా చెప్పింది. గంటసేపు మాట్లాడుకున్నాక అందులో రాజకీయాలు కూడా ఉండే ఉంటాయ‌నటంలో సందేహంలేదు. కాకపోతే వాళ్ళిద్దరూ ఏమి మాట్లాడుకున్నారనే విషయాలు బయటకు తెలిసే అవకాశంలేదు. కానీ ఎల్లోమీడియా మాత్రం రాజకీయాలు మాట్లాడేందుకు మోడీ అవకాశం ఇవ్వలేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. జగన్ కు వ్యతిరేకంగా ఎల్లోమీడియా ముందు రెడీచేసుకున్న స్క్రిప్టు ప్రకారమే కథనం ఇచ్చేసింది.

ఇక అమిత్ షా అసలు జగన్ కు అపాయిట్మెంటే ఇవ్వలేదని చెప్పింది. అసలు అమిత్ షా ను కలవటం జగన్ షెడ్యూల్లో ఉందో లేదో తెలీదు. పైగా మోడీతోనే గంటసేపు మాట్లాడిన తర్వాత ఇక అమిత్ షా మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత? జగన్ నిరాశ‌తో వెనక్కు వచ్చేశారని ఎల్లోమీడియా ఎలా చెప్పింది? ఎలాగంటే.. లోపల ఏమిజరిగినా తాను మాత్రం ఇలాగే రాయాలని ఫిక్సయ్యింది కాబట్టే. మీడియాతో మాట్లాడని వైనమంటూ ఎద్దేవా చేసింది. జగన్ మొదటినుండి మీడియాకు దూరమే.

ఇక చంద్రబాబునాయుడు విషయానికి వస్తే ఢిల్లీలో దిగిన తర్వాత దాదాపు ఆరుగంటల సేపు వెయిట్ చేస్తేకాని అమిత్ షా మాట్లాడలేదని అందరికీ తెలుసు. మరి ఇది చంద్రబాబుకు అవమానం కాదా. అమిత్ షా తో భేటీ తర్వాత చంద్రబాబు ఇంతవరకు మీడియాకు మొహం చూపకపోవటాన్ని ఏమంటారు? మీడియాలో కనబడకపోతే చంద్రబాబుకు ఊపిరికూడా ఆడదు. అలాంటి చంద్రబాబు నాలుగురోజులుగా ఢిల్లీలో ఏమి జరిగిందనే విషయాన్ని మీడియాకు ఎందుకు చెప్పలేదు? ఇక్కడే ఢిల్లీ టూర్లో తేడా కొట్టిందన్న విషయం అర్థ‌మైపోతోంది. దాన్ని దాచిపెట్టి జగన్ పై బురదచల్లేస్తున్నారంతే.

First Published:  10 Feb 2024 10:38 AM IST
Next Story