Telugu Global
Andhra Pradesh

జగన్ వల విసిరింది నిజమేనా?

ఈ నెల 12న జ‌ర‌గాల్సిన‌ టీటీడీ బోర్డు సభ్యుల నియామకం ఆగిపోయింది? ఎందుకంటే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కోస‌మని ఎల్లో మీడియా చెప్పింది.

జగన్ వల విసిరింది నిజమేనా?
X

ఏమో అలాగని ఎల్లో మీడియా బ్యానర్ కథనంలో చెప్పింది. ఇంతకీ వల విసిరింది దేనికంటే అత్యున్నత స్ధానాల్లో ఉన్న ఇద్దరిని మంచి చేసుకోవటానికట. ఎందుకు మంచి చేసుకోవాలంటే తనపైన ఉన్న కేసుల్లోనుండి బయటపడటానికి అని ఎల్లో మీడియా తేల్చేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే మొన్నటి 12వ తేదీనే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని నియమించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆగిపోయింది. ఇంతకీ బోర్డు సభ్యుల నియామకం ఆగిపోయింది? ఎందుకంటే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కోస‌మని ఎల్లో మీడియా చెప్పింది.

మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి టీటీడీ పాలక మండలిలో నియమిస్తాం అని జగన్మోహన్ రెడ్డి తరపున పై ఇద్దరికీ కబురు వెళ్ళిందట. అత్యున్నత స్థానాల్లో ఉన్న తాము ఇలాంటి అంశాలకు తావివ్వకూడదనే వాళ్ళు ఆ కబురును తిరస్కరించినట్లు ఎల్లో మీడియా చెప్పింది. దీనికి ఆధారం ఏమన్నా ఉందా అంటే తాము రాసిందే ఆధారం అన్నట్లుగా ఉంది కథనమంతా. తనపైన సీబీఐ కేసులు, వివేకా మర్డర్ కేసులో నుండి బయటపడేందుకే జగన్ పై ఇద్దరి మీద వల విసిరినట్లు ఎల్లో మీడియా చెప్పింది.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే నిజంగానే ప్రభుత్వంపై ఇద్దరి తరపున ఎవరినైనా బోర్డులో నియమించాలంటే మొత్తం బోర్డు నియామకాన్ని ఆపేయాల్సిన అవసరంలేదు. నియమించదలచుకున్న వాళ్ళల్లో రెండు సభ్యత్వాలను మినహాయించి మిగిలినవాళ్ళని అపాయింట్ చేసేయచ్చు. ఇక కేసులంటారా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ అయినా సీబీఐ డైరక్టర్ అయినా బోర్డులో సభ్యత్వాలను ఎరగా చూపిస్తే పడిపోయేంత చీప్‌ మెంటాలిటితో ఉంటారని ఎవరు అనుకోరు. ఇలాంటి ప్రతిపాదనలు పంపేముందే పై స్థానాల్లోని వ్యక్తుల నేపథ్యాన్ని తెలుసుకుంటారు.

జగన్ కేసుల్లో అయినా వివేకా కేసులో అయినా సాక్ష్యాలను బట్టే విచారణ జరుగుతుంది, తీర్పులుంటాయి. అంతేకానీ బోర్డులో సభ్యత్వాన్ని ఎరగా చూపిస్తే తప్పులు ఒప్పయిపోతాయా? అక్రమార్జన కేసుల్లో జగన్‌కు వ్యతిరేకంగా ఒక్క కేసులో కూడా సాక్ష్యాలు లేవు కాబట్టే ఒక్కో కేసును కోర్టులు కొట్టేస్తున్నాయి. ఇక వివేకా కేసులో ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా అనుకున్నట్లుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఏమీ దొరకలేదు. అందుకని హైకోర్టే అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

వివేకా కేసులో ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా టార్గెట్ జగనే కానీ అవినాష్ కాదు. సాక్ష్యాలుంటే తారుమారు చేయవ‌చ్చు కానీ అసలు సాక్ష్యాలే లేకపోతే ఎవరైనా ఎలా పుట్టించగలరు? అవినాష్ విషయంలో గూగుల్ టేకవుట్ సాంకేతికత ఆధారంగా కేసు పెట్టి పొరబాటు చేసినట్లు సీబీఐ స్వయంగా అంగీకరించింది. కాబట్టి చీఫ్ జస్టిస్, సీబీఐ డైరెక్టర్‌ను మంచి చేసుకోవాల్సిన అవసరం జగన్‌కు ఏముందో ఎల్లో మీడియానే చెప్పాలి.

అత్యంత నిజాయితీప‌రుడైన సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్‌ను ప్ర‌లోభ‌పెట్ట‌డానికి ఎవ‌రైనా సాహ‌సం చేస్తారా? ప్ర‌ధాని మోడీకే త‌ల‌వంచ‌ని డీవై చంద్రచూడ్ జ‌గ‌న్‌కు త‌ల‌వంచుతారా? బుర‌ద‌జ‌ల్లుడు వార్తాలు త‌ప్ప‌, ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండేవాళ్లు రాసే రాత‌లేనా ఇవి?

First Published:  15 Aug 2023 5:47 AM GMT
Next Story