చొక్కాకు బురద కాలేదని.. ఆయనకు బురద పూస్తున్నారు
బాధితులను పరామర్శించటం అంటే జగన్ కూడా బాధితుడి అవతారం ఎత్తాలని ఎల్లోమీడియా తేల్చేసింది. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని ఆదేశాలిచ్చే వాళ్ళు పాలకులు కాదని తేల్చేసింది.
జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత ద్వేషంతో ఎల్లోమీడియా రోజురోజుకు దిగజారిపోతోంది. తానేం రాస్తుందో కూడా చూసుకోకుండా బుర్రకు తోచింది వార్తల రూపంలో వండివార్చేస్తోంది. ఇంతకీ ఎల్లోమీడియాలో వచ్చిన బ్యానర్ హెడ్డింగ్ ఏమిటంటే.. ‘మట్టి అంటకుండా...చొక్కా నలగకుండా’ అని. తుపాను బాధితులను జగన్ పరామర్శించిన తీరుపై పెద్ద కథనం ఇచ్చారు. అందులో జగన్ రెడ్ కార్పెడ్ పరామర్శ అని తన అక్కసు వెళ్ళగక్కింది. రైతులతో మాట్లాడకుండానే తుపాను పీడిత ప్రాంతాల్లో జగన్ పర్యటించారట. విపత్తులు వస్తే జగన్ స్పందించాల్సిన తీరిదేనా అంటూ పెద్ద ప్రశ్న వేసింది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. బాధితుల పరామర్శ పేరుతో ఒక వైపు జగన్, మరో వైపు చంద్రబాబు నాయుడు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి కాబట్టి సహజంగానే జగన్ పర్యటనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎల్లోమీడియా ఇవ్వాల్సినంత కవరేజ్ ఇవ్వకపోయినా బాధితులు, స్థానిక జనాలు బాగా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా యుద్ధప్రాతిపదికన సాయం అందిస్తోంది. దాంతో పునరావాస కార్యక్రమాలపై నెగిటివ్‌గా రాయటానికి కూడా ఏమీలేకపోయింది.
అందుకనే జగన్‌ను వ్యక్తిగతంగా ఎటాక్ చేశారు. అదేమిటంటే.. జగన్ వేసుకున్న చొక్కాకు మట్టి అంటలేదట. కాళ్ళకు మట్టి, బురద అంటలేదట. ఇస్త్రీ బట్టలు నలగలేదట. చేతులకు దుమ్ము తగలలేదట. ఇలా బుర్రకు తోచిన బురదంతా జగన్ పైన చల్లేశారు. బాధితులను పరామర్శించటం అంటే జగన్ బురదలో పొర్లాడాలని ఎల్లోమీడియా ఉద్దేశంలాగుంది. కాళ్ళకు, చేతులకు బురదంటి, దుస్తులు బాగా నలిగిపోతేనే అంటే సర్ఫ్ ఎక్సెల్ అడ్వర్టైజ్మెంట్‌లో పిల్లలాగ తయారైతేనే బాధితులను పరామర్శించినట్లు లెక్కా..?
బాధితులను పరామర్శించటం అంటే జగన్ కూడా బాధితుడి అవతారం ఎత్తాలని ఎల్లోమీడియా తేల్చేసింది. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని ఆదేశాలిచ్చే వాళ్ళు పాలకులు కాదని తేల్చేసింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా తుపానులొచ్చాయి. అప్పుడు చంద్రబాబు బురదలో ఏమన్నా పొర్లాడారా..? ఒడిశా రైలు ప్రమాదం జరిగిన చోటికి నరేంద్రమోడీ వచ్చారట. దేనికంటే మానవత్వం, స్పందించే గుణం ఉంది కాబట్టేనట. ప్రమాద స్థలానికి మోడీ వచ్చి ఏమిచేశారో మాత్రం రాయలేదు. మోడీ కాసేపుండి ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చి వెళ్ళిపోయారు.
దానివల్ల ఏమైందంటే.. సహాయ చర్యలను వదిలిపెట్టి అధికార యంత్రాంగం మొత్తం మోడీ చుట్టే తిరిగింది. గతంలో తుపాను బాధితులను పరామర్శించినప్పుడు కూడా పనులను వదిలేసి యంత్రాంగమంతా చంద్రబాబు చుట్టే తిరిగింది. ఇప్పుడలాగ జరగటంలేదు. యంత్రాంగమంతా పూర్తిగా సహాయ పనుల్లోనే ఉన్నారు. ఎక్కడ కూర్చున్నా పనులు సక్రమంగా జరగటం, బాధితులకు సాయం అందించటమే జగన్ ఉద్దేశం. బాధితులకు సాయం అందటాన్ని కూడా ఎల్లోమీడియా తట్టుకోలేక చొక్కా, ఇస్త్రీ, మట్టి అంటూ బురదరాతలు రాసింది.