బుర్రకుతోచిన హెడ్డింగులతో రెచ్చగొట్టే రాతలు..
ఇదే ఎల్లోమీడియా ఇదే వలంటీర్లను ఒకప్పుడు సంఘవిద్రోహ శక్తులుగా చిత్రీకరించింది. ఎక్కడైనా ఒక వలంటీర్ తప్పుచేస్తే దాన్ని మొత్తం వలంటీర్ల వ్యవస్థకే ఆపాదించేసేది.
అపరిచితుడు సినిమాలో హీరో క్యారెక్టర్ ఒక్కోసారి ఒక్కో విధంగా రియాక్టవుతుంటుంది. అలాగే ఒకే సమయంలో రెండు భిన్నమైన క్యారెక్టర్లను ప్రదర్శిస్తుంటుంది. ఇప్పుడు ఎల్లోమీడియా వ్యవహారం కూడా అచ్చం అలాగే అయిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వలంటీర్లు సమ్మెబాట పట్టారని పదేపదే కథనాలు, వార్తలు రాస్తోంది. తాము సమ్మెచేయటంలేదని, సమ్మెచేస్తున్నట్లుగా వస్తున్న వార్తలన్నీ అబద్ధాలేనని వలంటీర్ల సంఘాలు ఎంత మొత్తుకుంటున్నా ఎల్లోమీడియా అయితే ఒప్పుకోవటంలేదు.
ప్రభుత్వానికి-ప్రజలకు వారధులుగా వలంటీర్లు పనిచేస్తున్నారని, ప్రభుత్వం వాళ్ళతో వెట్టిచాకిరీ చేయించుకుని జీతాలు కూడా సరిగా ఇవ్వటంలేదని, వేతనాలు పెంచాలన్న న్యాయపరమైన డిమాండ్లను కూడా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని పదేపదే వార్తలు మొదటిపేజీలో అచ్చేస్తోంది. అంటే వలంటీర్లకు మద్దతుగా ఎల్లోమీడియా వ్యవహరిస్తోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లోపు వలంటీర్లలో ఎంతమందిని వీలుంటే అంతమందిని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మార్చాలన్నది ఎల్లోమీడియా వ్యూహం. ఇందులో భాగంగానే వలంటీర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ వార్తలు రాస్తున్నది.
సీన్ కట్ చేస్తే.. ఇదే ఎల్లోమీడియా ఇదే వలంటీర్లను ఒకప్పుడు సంఘవిద్రోహ శక్తులుగా చిత్రీకరించింది. ఎక్కడైనా ఒక వలంటీర్ తప్పుచేస్తే దాన్ని మొత్తం వలంటీర్ల వ్యవస్థకే ఆపాదించేసేది. వలంటీర్లు చేసే చిన్న తప్పులను కూడా బూతద్దంలో చూపించి జనాల్లో వలంటీర్లంటే వ్యతిరేక భావన వచ్చేట్లుగా రెచ్చగొట్టేది. అయితే ఎల్లోమీడియా ఎంత ప్రయత్నించినా, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఎంత ప్రయత్నంచేసినా జనాలెవరు వాళ్ళ వలలో పడలేదు. అందుకనే వీళ్ళ ప్రకటనలు, ఆరోపణలను జనాలు అస్సలు లెక్కచేయలేదు.
వలంటీర్లకు వ్యతిరేకంగా వార్తలిచ్చి ఉపయోగంలేదని అర్థమైపోవటంతో ఇప్పుడు ఎల్లోమీడియా ప్లేటు ఫిరాయించింది. ఆశావర్కర్లు, హెల్త్ వర్కర్లు సమ్మెచేస్తున్నారు. వాళ్ళతో పాటు వలంటీర్లను కూడా కలిపేసింది. రగులుతున్న రాష్ట్రమని, ఆందోళనాంధ్ర అని బుర్రకుతోచిన హెడ్డింగులు పెట్టేసి అందరినీ రెచ్చగొట్టే వార్తలు రాస్తోంది. ఒకప్పుడు ఉద్యోగులను తర్వాత టీచర్లను రెచ్చగొట్టాలని ప్రయత్నించి ఫెయిలైంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా అందుకనే ఇప్పుడు వలంటీర్లు సమ్మెచేయటంలేదని చెబుతున్నా ఎల్లోమీడియా వినిపించుకోకుండా ఎలాగైనా సరే వాళ్ళని సమ్మెలోకి దింపాలన శతవిధాల ప్రయత్నంచేస్తోంది. అందుకనే ఎల్లోమీడియా వ్యవహారం అపరిచితుడు క్యారెక్టర్‌లా మారిపోయిందనిపిస్తోంది.