రఘురామకు దింపుడు కళ్లం ఆశ.. పోటీ చేస్తారంటూ ఎల్లో మీడియా హడావుడి
ఎంపీగా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు రఘురామ చేసింది సున్నా. నాలుగేళ్లపాటు నియోజకవర్గ ముఖమే చూడని రాజుకు అభ్యర్థిత్వం ఇస్తే ఓట్లు అడగడానికి వెళ్లినప్పుడు జనం నిలదీస్తారని కూటమి నేతలకు భయం ఉంది.
వైఎస్ జగన్‌తో విబేధించి, నాలుగేళ్లపాటు స్వపక్షంలోనే విపక్షంలా నిత్యం విషం చిమ్మిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అందుకు ఫలితం అనుభవిస్తున్నారు. అటు వైసీపీని వదిలేసి.. ఇటు టీడీపీ, బీజేపీ చేరదీయక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ సీట్లకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఖరారయిపోయారు. కానీ, రఘురామకు ఎక్కడా టికెట్ దక్కలేదు. అయినా కూడా రఘురామ పోటీపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో చర్చిస్తున్నారని ఎల్లో మీడియా ఆయనకు ఎక్కడ లేని ఆశలు కల్పిస్తోంది. ఇప్పటికే ఖరారయిన సీట్లలో సర్దుబాటు చేసైనా సరే టికెట్ ఇస్తారంటూ దింపుడు కళ్లం ఆశలు రేకెత్తిస్తోంది.
అన్నిచోట్లా ఫిక్స్
ఈ రోజు ప్రకటించిన జాబితాతో టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. బీజేపీ తనకిచ్చిన 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను రెండు రోజుల కిందటే ప్రకటించేసింది. జనసేనకు 2 ఎంపీ సీట్లున్నా అందులో ఆల్రెడీ అభ్యర్థులు ఫిక్సయిపోయారు. మరి త్రిబుల్ ఆర్‌కు సీటెక్కడిది?
నరసాపురంలో వ్యతిరేకత ఉందనే టికెట్ ఇవ్వలేదా?
ఎంపీగా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు రఘురామ చేసింది సున్నా. నాలుగేళ్లపాటు నియోజకవర్గ ముఖమే చూడని రాజుకు అభ్యర్థిత్వం ఇస్తే ఓట్లు అడగడానికి వెళ్లినప్పుడు జనం నిలదీస్తారని కూటమి నేతలకు భయం ఉంది. అందుకే ఆయన జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు టికెట్ దగ్గరకొచ్చేసరికి లైట్ తీసుకున్నారు.
బీజేపీ భయం ఇదీ
పోనీ బీజేపీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకుందామన్నా దశాబ్దాలుగా పశ్చిమగోదావరిలో పార్టీకి సేవ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ ఇచ్చారు. ఆయన్ను పక్కనపెట్టి ఇప్పుడు రఘురామకు ఇస్తే తనకున్న ఆ మాత్రం క్రెడిబిలిటీ కూడా పోతుందని బీజేపీ భయం. ఇలా ఏ పార్టీలోనూ అవకాశం లేకపోయినా రఘురామకృష్ణంరాజుకు సీటు దక్కుతుందని ఎల్లో మీడియా ఊరేగించడంలో ఆంతర్యమేంటో మరి!