Telugu Global
Andhra Pradesh

దావోస్ వెళ్ళకపోయినా ఏడుపేనా..?

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు క్రమం తప్పకుండా దావోస్ కు హాజరయ్యారు. ఎన్నివేల కోట్లరూపాయల పెట్టుబడులు సాధించారంటే సున్నాఅనే చెప్పాలి.

దావోస్ వెళ్ళకపోయినా ఏడుపేనా..?
X

జగన్మోహన్ రెడ్డిపైన ఎలాగైనా బురదచల్లేయాలన్నది ఎల్లోమీడియా టార్గెట్. అందుకు కొత్తగా ఎలాంటి సబ్జెక్టు దొరక్కపోతే ఎప్పటివో పాత విషయాలకు మసిపూసి కొత్తగా మొదటిపేజీల్లో అచ్చేసి తృప్తిపడుతున్నాయి. ఇప్పుడు అచ్చేసిన కథనం ఏమిటంటే.. జగన్ దావోస్ వెళ్ళలేదట. ‘ఓసోస్... మనకెందుకు దావోస్’, ‘దావోస్ కు బైబై’ అనే కథనాలను ఫ్రంట్ పేజీలో అచ్చేశాయి. రెండింటిలోనూ ఒకే విధమైన కథనం వచ్చిందంటే రెండూ కూడబలుక్కొని రాసుంటాయి లేకపోతే మెటీరియల్ ఇచ్చి ఇద్దరితోనూ రాయించుంటారు.

కథనంలో ఎల్లోమీడియా ఏడుపేమిటంటే.. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి జగన్ వెళ్ళలేదట. ఐదేళ్ళలో నాలుగుసార్లు సమావేశాలు జరిగితే ఒక్కసారి మాత్రమే హాజరయ్యారట. దావోస్ కార్యక్రమంలో జగన్ పాల్గొనలేదు కాబట్టి పరిశ్రమలను తేవటంలో జగన్‌కు ఇంట్రస్టు లేదని ఎల్లోమీడియా తేల్చేసింది. పొరుగురాష్ట్రాన్ని చూసైనా జగన్ బుద్ధి తెచ్చుకోలేదట. దావోస్ కు వెళ్ళలేదన్న విషయాన్ని పట్టుకుని జగన్ పైన తమకున్న కసినంతా తీర్చుకున్నాయి. జగన్ వెళ్ళకపోవటాన్ని తప్పుపట్టిన ఎల్లోమీడియా మరి క్రమం తప్పకుండా హాజరైన చంద్రబాబు ఎన్నివేల కోట్లరూపాయల పెట్టుబడులు తెచ్చారని మాత్రం రాయలేదు.

ఇక్కడ విషయం ఏమిటంటే.. దావోస్ కు వెళితే పారిశ్రామికవేత్తలతో సమావేశమవ్వొచ్చన్నది వాస్తవమే. అయితే అందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపితేనే. అంతర్జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమాన్ని దేశాధ్యక్షులు, దేశాల ప్రతినిధులను పట్టించుకుంటారే కానీ, మన రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎవరు పట్టించుకోరు. దావోస్ సదస్సుకు ముఖ్యమంత్రులు వెళ్ళామా.. వచ్చామా అన్నట్లు మాత్రమే ఉంటుంది. దావోస్ లో ఏ ముఖ్యమంత్రి ఒప్పందాలు చేసుకున్నా ఎక్కువభాగం మనదేశంలోని పారిశ్రామికవేత్తలతోనే అయ్యుంటుంది.

అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు క్రమం తప్పకుండా దావోస్ కు హాజరయ్యారు. ఎన్నివేల కోట్లరూపాయల పెట్టుబడులు సాధించారంటే సున్నాఅనే చెప్పాలి. రానుపోను ఖ‌ర్చులు కూడా దండగే. ఎందుకంటే.. దావోస్ నుండి ఆహ్వానం రాకపోయినా ఇన్విటేషన్ కు చంద్రబాబు, లోకేష్ దాదాపు రూ. 3.5 కోట్లు పెట్టి కొనుక్కుని హాజరయ్యేవారు. చంద్రబాబు దావోస్ పర్యటనను మొదటిపేజీలో ఎల్లోమీడియా ప్రముఖంగా అచ్చేసేందుకు మాత్రమే పనికొచ్చేది. ఎన్నిపెట్టుబడులు వచ్చాయో మళ్ళీ చెప్పేవాళ్ళు కాదు.

ఒకవైపు దావోస్ కు వెళ్తూనే మరోవైపు వైజాగ్ లో పెట్టుబడుల సదస్సు పేరుతో చంద్రబాబు జనాలను మాయచేశారు. జగన్ కూడా విశాఖలో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహించి పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టే దావోస్ కు అవసరంలేదని జగన్ అనుకునుండచ్చు. దావోస్ కు రేవంత్ రెడ్డి వెళ్ళటాన్ని ఎల్లోమీడియా ప్రస్తావించింది. దేశంలో 30 రాష్ట్రాలుంటే ఎంతమంది ముఖ్యమంత్రులు వెళుతున్నారు ? చాలామంది వెళ్ళటమే లేదు. ఈ మాత్రందానికి జగన్ దావోస్ వెళ్ళలేదని ఏడుపెందుకో ?

First Published:  17 Jan 2024 11:10 AM IST
Next Story