లోకేష్‌ను ఎల్లో మీడియా లోపలికి తోసేసిందా?
వారాహి యాత్ర మొదలవ్వటం ఆలస్యం ఎల్లో మీడియా తన స్టాండ్ మార్చేసుకుంది. లోకేష్ పాదయాత్ర యువగళం వార్తలు, ఫొటోలు లోపలపేజీలకు పరిమితం చేసింది. లోకేష్ కూడా జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడుతున్నా ఫ్రంట్ పేజీల్లో అచ్చు వేయడం లేదు.
ఎల్లో మీడియా వైఖరి, తీసుకునే స్టాండ్ చాలా విచిత్రంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు ఏమి మాట్లాడినా సరే మొదటిపేజీలో వేసేస్తోంది. సమయం, సందర్భం ఏమీ అవసరంలేదు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారా లేదా అన్నదే పాయింట్. ఈ పాయింట్‌తోనే లోకేష్ ఏమి మాట్లాడినా ఆ మధ్య మొదటి పేజీలో అచ్చేసేది. అయితే గడచిన ఎనిమిది రోజులుగా లోకేష్ వార్తలు, ఫొటోలను లోపలిపేజీల్లో ఎక్కడికో నెట్టేశారు.
కారణం ఏమిటంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రనే చెప్పాలి. ప్రత్తిపాడులో మొదలుపెట్టిన దగ్గర నుండి పవన్ అమలాపురం వరకు జగన్‌ను ఎన్నిసార్లు టార్గెట్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ వారాహి యాత్ర మొదలుపెట్టిందే జగన్‌కు వ్యతిరేకంగా అని అర్థమైపోతోంది. ఎవరైనా తమ గురించి, పార్టీని పాపులర్ చేయటానికే యాత్రల్లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కానీ పవన్ మాత్రం ఎక్కువసేపు జగన్‌కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు.
అందుకనే ఎల్లో మీడియా తన స్టాండ్ మార్చేసుకుంది. వారాహి యాత్ర మొదలవ్వటం ఆలస్యం లోకేష్ పాదయాత్ర యువగళం వార్తలు, ఫొటోలు లోపలపేజీలకు పరిమితమైపోయింది. లోకేష్ కూడా జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, చాలెంజ్‌లు చేస్తున్నారు అయినా ఫ్రంట్ పేజీల్లోకి ఎక్కటంలేదు. మధ్యలో చంద్రబాబునాయుడు పార్టీ నేతల సమీక్షల్లో జగన్‌కు వ్యతిరేకంగా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఏదో తప్పదన్నట్లుగా మొదటి పేజీలో చంద్రబాబు ఫొటో వేసి బుల్లెట్ పాయింట్లు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన వార్తంతా లోపలపేజీల్లోనే వేస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ కూడా జనసేనను గెలిపించండి, తననే ముఖ్యమంత్రిని చేయండని అడిగిన మూడు రోజులు ప్రాధాన్యత తగ్గించేశారు. ఆ మూడు రోజులు పాత అంశాలనే కొత్తగా ముస్తాబు చేసి సొంత స్టోరీలను మొదటి పేజీలో వేసుకున్నారు. ఎప్పుడైతే ప్రత్యేక ఇంటర్వ్యూలు చేశారో అప్పటి నుండి మళ్ళీ మొదటి పేజీల్లో పవన్ వార్తలను ప్రముఖంగా అచ్చేస్తున్నారు. మొత్తానికి ఒక్కోసారి ఒక్కోవిధంగా జగన్ వ్యతిరేక వార్తలను మొదటి పేజీల్లో అచ్చు వేస్తూ తమ ప్రయారిటిని బాగానే చూసుకుంటున్నారు. కాకపోతే ఈ మొత్తంలో అన్యాయం అయిపోయిదెవరంటే లోపలపేజీల వార్తలతో లోకేష్ అనే చెప్పాలి.