Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు పెట్టిన బాకీని తీర్చిన జగన్‌పైనా అక్కసు..

వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 27 లక్షల మంది విద్యార్థులకు జగనన్న దీవెన, వసతి దీవెన కింద గత ప్రభుత్వ బకాయిలతో కలిపి రూ.18,576 కోట్లు చెల్లించింది.

చంద్రబాబు పెట్టిన బాకీని తీర్చిన జగన్‌పైనా అక్కసు..
X

పేద పిల్లలపై మమకారంతో, వారిని ఉన్నతంగా నిలపాలనే ఆశయంతో ప‌నిచేస్తున్న‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఎల్లో మీడియా దుష్ప్రచారానికి ఒడిగడుతోంది. విద్యార్థుల విషయంలో జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ బహుశా ఎవరూ తీసుకుని ఉండరు. అయినా కన్ను కుట్టి ఎల్లో మీడియా కల్లబొల్లి కథలు అల్లుతోంది. గత చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, వైఎస్‌ జగన్‌ ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందనేది బేరీజు వేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. చంద్రబాబు విద్యార్థులను ముంచిన విషయం రామోజీరావుకు అస‌లు పట్టదు.

చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి రూ.2,428 కోట్లు ఉంటే, జగన్‌ ప్రభుత్వంలో రూ.4,044 కోట్లుగా ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.35 వేల లోపు ఇస్తే.. జగన్‌ ప్రభుత్వం రూ.3 లక్షల వరకు చెల్లిస్తోంది. జవాబుదారీతనం పెంచే విధంగా, పారదర్శకంగా విద్యార్థుల త‌ల్లుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి మూడు నెలలకు విద్యాదీవెన కింది డబ్బులను జగన్‌ ప్రభుత్వం జమ చేస్తోంది.

టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఏడాదికి సగటున రూ.2,066 కోట్లు, హాస్టల్‌ ఖర్చుల కింద రూ.362 కోట్లు మాత్రమే చెల్లించేది. ఈ లెక్కన ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ.12,141 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వం 2017 నుంచి 16.73 లక్షల మంది విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.1,778 కోట్లు బకాయి పెట్టింది ఆ బకాయిలను జగన్‌ ప్రభుత్వం తీర్చింది.

వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 27 లక్షల మంది విద్యార్థులకు జగనన్న దీవెన, వసతి దీవెన కింద గత ప్రభుత్వ బకాయిలతో కలిపి రూ.18,576 కోట్లు చెల్లించింది. ఏడాదికి సగటున విద్యాదీవెన కింద రూ.2,835 కోట్లు, వసతి దీవెన కింద రూ.1,068.94 కోట్లు ఖర్చు చేస్తోంది.

First Published:  15 Feb 2024 9:10 AM IST
Next Story