చేతులు కాలాక ఆకులు.. కూటమి మేనిఫెస్టోపై వివరణలు
ఏపీలో టీడీపీ-జనసేన అసత్య హామీలకు గ్యారెంటీగా ఉండటం ఇష్టంలేకే, బీజేపీ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది. దాన్ని కవర్ చేసుకోడానికి ఇప్పుడు టీడీపీ తంటాలు పడుతోంది.
కూటమి మేనిఫెస్టో విడుదల సమయంలో లుకలుకలు బయటపడ్డాయి. ఈ మేనిఫెస్టోకి బీజేపీ సపోర్ట్ లేదనే విషయం తేలిపోయింది. కనీసం మేనిఫెస్టోపై కానీ, వెనక ఉన్న బ్యానర్ పై కానీ మోదీ ఫొటో లేదు, కమలం పువ్వు ఫొటో కూడా లేదు, బీజేపీ తరపున ఆ కార్యక్రమానికి హాజరైన ప్రతినిధి, ఆ మేనిఫెస్టో కాపీని పట్టుకోడానికి విముఖత వ్యక్తం చేశారు. దీని అర్థం ఏంటి..? మేనిఫెస్టో బీజేపీకి ఇష్టం లేదని, ఆ హామీలకు బీజేపీ గ్యారెంటీ కాదని. ఈ విషయంలో విమర్శలు చెలరేగిన తర్వాత, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచాక ఇప్పుడు టీడీపీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. మేనిఫెస్టో గురించి ఎల్లో మీడియాలో క్లారిటీ ఇస్తోంది.
బీజేపీ సూచనలతోనే..
కూటమి మేనిఫెస్టో రూపకల్పనలో బీజేపీ భాగస్వామి కాలేదని స్పష్టం చేస్తున్నారు ఆ పార్టీ ఏపీ సహ ఇన్ చార్జ్ సిద్దార్థ్ నాథ్ సింగ్. అయితే అదే సమయంలో బీజేపీ సలహాలను, సూచనలను మేనిఫెస్టోలో పొందుపరిచారని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఈ వివరణ ఏమాత్రం సరిపోవడం లేదు.
ఎన్డీయే తన మేనిఫెస్టోను జాతీయ స్థాయిలో ప్రకటించిందని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలసి పోటీ చేస్తున్న చోట... అక్కడ మేనిఫెస్టోల్లో బీజేపీ భాగస్వామి కావడం లేదని సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పారని అంటున్నారు. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఇక్కడ టీడీపీ-జనసేన మాత్రమే సంయుక్తంగా మేనిఫెస్టోను విడుదల చేశాయని బీజేపీ వివరణ ఇచ్చినట్టు ఎల్లో మీడియా కథనాలిస్తోంది.
గతం గుర్తులేదా..?
2014 కూటమి మేనిఫెస్టోని ఓసారి పరిశీలిస్తే బీజేపీ వివరణ, ఎల్లో మీడియా కథనాలు ఎంత అవాస్తమో అర్థమవుతాయి. అప్పటి మేనిఫెస్టోలో మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలను ప్రముఖంగా ప్రచురించారు. అప్పట్లో జనసేన కనీసం పోటీలో కూడా లేదు, కేవలం కూటమికి మద్దతు మాత్రమే ఇచ్చింది. కానీ మేనిఫెస్టోపై పవన్ ఫొటో ఉంది. మరి 2024కి వచ్చే సరికి మోదీ ఫొటో ఎందుకు మాయమైందనేది ప్రశ్నార్థకం. ఏపీలో టీడీపీ-జనసేన అసత్య హామీలకు గ్యారెంటీగా ఉండటం ఇష్టంలేకే, బీజేపీ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది. దాన్ని కవర్ చేసుకోడానికి ఇప్పుడు టీడీపీ తంటాలు పడుతోంది.