Telugu Global
Andhra Pradesh

జగన్ పై చార్జిషీట్లట.. నిజమేనా..?

ప్రచారం జరుగుతున్నట్లుగా రాష్ట్రంలో నిజంగానే అవినీతి పాలన జరుగుతోందని, అరాచకాలు పెరిగిపోతున్నాయని నిర్ధారణ చేసుకుంటే జగన్‌ను కంట్రోల్ చేయటం మోడీకి నిముషంలో పని.

జగన్ పై చార్జిషీట్లట.. నిజమేనా..?
X

వైసీపీ లెక్కలు తీయండి.. చార్జిషీట్లను పల్లెల నుంచి నగరం వరకు జనాలందరికీ వివరించండి.. ముఖ్యమంత్రిగా పనిచేసే వచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి చెడగొట్టుకుంటున్నారు.. ఏమాత్రం ఉపేక్షించద్దు.. ప్రభుత్వంపై నిరంతరం పోరాటాలు చేయండి అని బీజేపీ నేతలకు నరేంద్రమోడీ చెప్పారట. అసలు జగన్ ప్రభుత్వంపై పోరాటాలు చేయకుండా ఇంతకాలం ఎవరు అడ్డుకున్నారు..? అని కమలనాధులపై మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారట.

ఇవన్నీ జగన్ పై ఎల్లోమీడియా మొదలుపెట్టిన ప్రచారాలు. బీజేపీ కోర్ కమిటీ నేతలతో భేటీలో జగన్ కు వ్యతిరేకంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని, ఇంతకాలం పోరాటాలు చేయనందుకు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారంటూ కథనాలు ఇచ్చింది ఎల్లోమీడియా. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు మోడీ. చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి కన్నా పదాకులు ఎక్కువ చదివే ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నారు.

ప్రచారం జరుగుతున్నట్లుగా రాష్ట్రంలో నిజంగానే అవినీతి పాలన జరుగుతోందని, అరాచకాలు పెరిగిపోతున్నాయని నిర్ధారణ చేసుకుంటే జగన్‌ను కంట్రోల్ చేయటం మోడీకి నిముషంలో పని. జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు అండ్ కో చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత..? తమ మిత్రపక్షం జనసేన అధినేత చేస్తున్న గోలలో నిజమెంత..? తెలుసుకోలేనంత అమాయకుడు కాదు మోడీ. ఇక పార్టీ బలోపేతమంటారా మోడీకి ఇదే మొదటి ప్రయారిటీ అనటంలో సందేహంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పుండవ‌చ్చు అందులో సందేహించాల్సిందేమీ లేదు.

జగన్ మీద నమోదైన అక్రమాస్తుల కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమన్న విషయం మోడీకి తెలీదా..? ఆ కేసులే కోర్టుల్లో వీగిపోతున్నాయి. సోనియాగాంధీని ధిక్కరించి కాంగ్రెస్ లోనుండి బయటకు వెళ్ళినందుకే జగన్ మీద కేసులు పడ్డాయని స్వయంగా ఒకప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలుగా ఉన్న గులాం నబీ ఆజాద్, జైం రామ్ రమేష్ లాంటి వాళ్ళే చెప్పారు కదా. కాబట్టి జగన్ పైన చార్జిషీట్లు వేయండి అని మోడీ చెప్పటం నమ్మేట్లుగా లేదు. ఎందుకంటే నాన్ ఎన్డీయే పార్టీల్లో నమ్మకమైన మిత్రుడుగా ప్రతి అవసరం లోనూ ఆదుకుంటున్నది జగన్ మాత్రమే. ఇలాంటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయమని చెప్పటం వరకు స‌రే, కానీ ఏకంగా చార్జిషీట్లు వేయమని చెప్పారంటేనే నమ్మేట్లుగా లేదు. బహిరంగసభలో మోడీ మాటల్లో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశముంది.

First Published:  12 Nov 2022 10:11 AM IST
Next Story