Telugu Global
Andhra Pradesh

ప్చ్.. సిట్ మాకు నచ్చలేదు, ఎల్లో మీడియా అసహనం

సిట్ ఏర్పాటు, అందులోని అధికారుల నియామకం టీడీపీకి ఇష్టం లేదని తెలుస్తోంది. రేపు సిట్ దర్యాప్తులో టీడీపీ నేతలది, వారితో అంటకాగిన పోలీస్ అధికారులది తప్పని తేలినా ఎల్లో మీడియా రచ్చ చేయడం ఖాయం.

ప్చ్.. సిట్ మాకు నచ్చలేదు, ఎల్లో మీడియా అసహనం
X

ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్లపై విచారణకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేశారు కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ప్రస్తుతం సిట్ దర్యాప్తు మొదలైంది. అయితే ఈ దర్యాప్తు ఎల్లో మీడియాకు నచ్చడంలేదు. అసలు సిట్ ఏర్పాటు కూడా వారికి నచ్చినట్టు లేదు. అందుకే సిట్ పై విషం కక్కుతూ కథనాలిస్తోంది. సిట్ టీమ్ లో చాలామంది మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తారని అనుమానిస్తోంది. వారితో దర్యాప్తు నిస్పక్షపాతంగా జరగదని వాదిస్తోంది.

ఏపీలో జరిగిన ఎన్నికల అల్లర్లకు కారణం కొత్తగా నియమించిన అధికారులేననేది వైసీపీ నేతల వాదన. కాదు కాదు, మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి హయాంలో నియమితులైన అధికారుల వల్లే గొడవలు జరిగాయని టీడీపీ అంటోంది. ఈ దశలో సిట్ దర్యాప్తు కీలకంగా మారింది. అయితే సిట్ దర్యాప్తులో టీడీపీ టార్గెట్ చేసిన పేర్లే బయటకు రావాలనేది ఎల్లో మీడియా ఆకాంక్ష. ఇప్పుడది సాధ్యమయ్యేలా లేదు. అందుకే సిట్ అధికారుల్ని తప్పుబడుతూ కథనాలిస్తోంది.

మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఏసీబీ డీజీగా పనిచేస్తున్నారు. ఇటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లోని 13 మంది సభ్యుల్లో 9 మంది ఏసీబీలోనే పనిచేస్తున్నారు. వీరంతా రాజేంద్రనాథ్ రెడ్డికి అనుకూలంగానే దర్యాప్తులో వ్యవహరిస్తారని, ఆయన హయాంలో నియమితులైన అధికారుల్ని వారు తప్పుబట్టే అవకాశం లేదని ఎల్లో మీడియా వరుస కథనాలిస్తోంది. సిట్ లోని ఆయా అధికారులు రాజేంద్రనాథ్ రెడ్డిపై స్వామిభక్తి చూపిస్తారని అటు టీడీపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అంటే సిట్ ఏర్పాటు, అందులోని అధికారుల నియామకం టీడీపీకి ఇష్టం లేదని తెలుస్తోంది. రేపు సిట్ దర్యాప్తులో టీడీపీ నేతలది, వారితో అంటకాగిన పోలీస్ అధికారులది తప్పని తేలినా ఎల్లో మీడియా రచ్చ చేయడం ఖాయం. అందుకే ముందు చూపుగా సిట్ పై నిందలు వేస్తున్నారు.

First Published:  19 May 2024 9:17 AM IST
Next Story