Telugu Global
Andhra Pradesh

ప్రచారం ఆగింది కానీ, దుష్ప్రచారం ఆగలేదు

ఎక్కడికక్కడ వైసీపీ నాయకుల కుటుంబ సమస్యలను హైలైట్ చేస్తూ ఎల్లో మీడియా జగన్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.

ప్రచారం ఆగింది కానీ, దుష్ప్రచారం ఆగలేదు
X

ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసింది. నేతలంతా మైకులు పక్కనపెట్టి రిలాక్స్ అవుతున్నారు. చంద్రబాబు లాంటి వారు తీర్థయాత్రల బాట పట్టారు, పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ప్యాకప్ చెప్పి హైదరాబాద్ వెళ్లారు. జగన్ రేపు పోలింగ్ కోసం పులివెందుల వెళ్లే ఏర్పాట్లలో ఉన్నారు. ఈ దశలో ఎల్లో మీడియా మాత్రం తన దుష్ప్రచారం కంటిన్యూ చేస్తోంది. వైసీపీ అభ్యర్థుల కుటుంబ సభ్యులు, వారి చుట్టాలు.. ఎక్కడో సోషల్ మీడియాలో మాట్లాడిన మాటల్ని హైలైట్ చేస్తూ ఆయా అభ్యర్థులపై బురదజల్లాలని చూస్తోంది.

అభ్యర్థుల తరపున నేరుగా ప్రచారం చేయడానికి వీల్లేకపోవడంతో, దుష్ప్రచారాన్ని కొనసాగిస్తోంది ఎల్లో మీడియా. తాజాగా మంత్రి ఉషశ్రీచరణ్ భర్తపై ఓ వీడియో హైలైట్ అవుతోంది. మంత్రి భర్త శ్రీచరణ్ తమను మోసం చేశారని ఆయన మేనమామ జగన్నాథ్‌ భార్య నాగవేణి ఆరోపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఎల్లో మీడియా వార్తలిస్తోంది. ఎప్పుడో, ఎక్కడో మోసం జరిగిందని సరిగ్గా ఎన్నికల వేళ వాళ్లంతా సోషల్ మీడియాకి ఎక్కడం, ఆ వీడియోలని ఎల్లో మీడియా వాడుకోవడం ఇక్కడ విశేషం.

నేరుగా సీఎం జగన్ ని టార్గెట్ చేయలేక, ఈసారి కుటుంబ సభ్యుల్ని కూడా చంద్రబాబు విభజించారనే విమర్శలు వినపడుతున్నాయి. షర్మిల, సునీత ఆమె కుటుంబ సభ్యులు ముందునుంచీ జగన్ ని విమర్శిస్తూ వచ్చారు. చివరి రోజు విజయమ్మతో కూడా తమకి అనుకూలంగా ఓ వీడియోని విడుదల చేసింది షర్మిల టీమ్. ఇక అంబటి రాంబాబు అల్లుడిని తెరపైకి తెచ్చి మరో నాటకం ఆడారు. ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కొడుకు పేరుతో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఇక పోటీలో లేకపోయినా ముద్రగడ ఫ్యామిలీని కూడా రచ్చకీడ్చడం విశేషం. ముద్రగడ కుమార్తెను ఆయనకు వ్యతిరేకంగా బయటకు తెచ్చారు. ఆమెతో పవన్ కల్యాణ్ కి అనుకూలంగా మాట్లాడించారు. ఇక ఎన్నికల ప్రచారం పూర్తయ్యే సమయానికి మంత్రి ఉషశ్రీ చరణ్ భర్తని టార్గెట్ చేశారు. ఎక్కడికక్కడ వైసీపీ నాయకుల కుటుంబ సమస్యలను హైలైట్ చేస్తూ ఎల్లో మీడియా జగన్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.

First Published:  12 May 2024 8:58 AM IST
Next Story