అమరావతికి కౌంటర్ గా వైసీపీ భారీ వ్యూహం !
ఒకవైపు అమరావతే ఏకైక రాజధాని కావాలంటూ టీడీపి మద్దతుతో రైతుల పాద యాత్ర సాగుతుండగా దానికి పోటీగా మూడురాజధానులు కావాలంటూ నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతంనుంచి అమరావతి వరకూ భారీ పాదయాత్ర నిర్వహించాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది.
ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న పాదయాత్రను దీటుగా ఎదుర్కొని మూడు రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకునేందుకు వైసిపి భారీ వ్యూహం రచిస్తున్నట్టు కనబడుతోంది. నవంబర్ ఒకటవ తేదీన అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం కానున్నది. ఈ సమాచారం ప్రభుత్వానికి ఉత్సాహం ఇచ్చింది.
మూడు రాజధానులు ఏర్పాటుకు సానుకూల తీర్పు వస్తుందనే విశ్వాసంతో ఉంది ప్రభుత్వం. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని ఏపీ హైకోర్టు అడ్డుకున్నది. దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయాన్ని సత్వరమే విచారించాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీనిపై నవంబర్ 1న విచారణ చేపట్టేందుకుఅంగీకరించింది.
ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు జరిగి తీరుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టా రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటును సమర్ధిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యులు పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు నేరుగా సీఎం జగన్ ను కలిసే తన అభిప్రాయాన్ని చెప్పారని, అప్పుడే తొందరపడవద్దని ఆయనకు సీఎం సూచించారని వార్తలు వచ్చాయి. అలాగే ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అవంతి శ్రీనివాసరావు మరికొందరు కూడా రాజీనామాలకు సిద్ధపడ్డారు.
అంతకు ముందే విశాఖ రాజధానిని సమర్ధిస్తూ ఉత్తరాంధ్రకు చెందిన నాయకులు రాజకీయేతర సంయుక్త కార్యాచరణ కమిటి (నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ)ని ఏర్పర్చి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అమరావతి యాత్రను గట్టిగా ఎదుర్కొని విశాఖ రాజధాని అంశాన్ని బలంగా ఈ ప్రాంత ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు నిర్ణయించారు.
నాన్ పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో విశాఖ లో గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో అధిక భాగం వైసిపి నేతలు మంత్రులు ఎమ్మెల్యేలే పాల్గొని మద్దతు పలికారు. జెఎసి కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. దీనిలో రాయలసీమ, కోస్తా ప్రాంతాలకు చెందిన మంత్రులు, కీలక నేతలు కూడా పాల్గొని అమవరావతి యాత్ర పై తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి యాత్ర తెలుగుదేశం స్పాన్సర్డ్ అని, భూస్వాములే తప్ప రైతుల యాత్ర కాదని విమర్శించారు. దీంతో ఈ గర్జనలన్నీ తెరవెనకనుంచి వైసిపి నడిపిస్తున్నదనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
కోనసీమ ప్రాంతానికి అమరావతి యాత్ర చేరుకుంటున్నప్పటి నుంచి అడగడుగునా వ్యతిరేకతతో ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారంనాడు యాత్రలో కోర్టు అనుమతికి మించి జనం పాల్గొంటున్నారని దీంతో శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతికి మించి యాత్రలో ఎక్కువమంది పాల్గొనడానికి వీల్లేదని కోర్టు ఆదేశించడంతో అమరావతి యాత్రికులకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. గుర్తింపుకార్డులు లేనివారిని అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో రాజీనామాలు అంటూ వైసిపి ముఖ్యులు చేస్తున్న హడావిడి చూస్తుంటే రాజీనామాల పేరుతో వైసిపి భారీ వ్యూహ రచన చేసి ఉండొచ్చనే సందేహాలు కలుగుతున్నాయంటున్నారు. అలాగే అమరావతి యాత్రకు కౌంటర్ గా విశాఖ రాజధాని డిమాండ్ తో ఉత్తరాంధ్ర ప్రాంతంనుంచి అమరావతి వరకూ భారీ పాదయాత్ర నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, రాజా తదితరులు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారని అంటున్నారు. దీనికి ఇంకా తుది రూపం ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ కు నివేదించి ఆయన అనుమతితో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు, ఉత్తరాంధ్ర టు అమరావతి పాదయాత్ర వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ లక్ష్యాన్నిబలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వీలవుతుందని ముఖ్యులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.