Telugu Global
Andhra Pradesh

విశాఖ బీచ్ ని ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం

విశాఖకు పరిపాలన రాజధాని వస్తున్న సందర్భంలో నగరానికి మరిన్ని హంగులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. విశాఖ బీచ్ ని ముంబై తరహాలో అభివృద్ధి చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కూడా త్వరలో ప్రారంభమవుతుందన్నారు.

విశాఖ బీచ్ ని ముంబై తరహాలో అభివృద్ధి చేస్తాం
X

మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజునుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశముంది. మరోవైపు విశాఖకు రాజధాని ఫిక్స్ అయినట్టేనని చెబుతూ.. పారిశ్రామిక వేత్తలతో నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. విశాఖ ప‌రిపాలనా రాజధానిగా రూపుదిద్దుకునే క్రమంలో అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, వ్యాపారవర్గాలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని భరోసా ఇచ్చారు విశాఖ జిల్లా వైసీపీ ఇన్ చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. మంత్రి అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఉత్తరాంధ్ర పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఇప్పటి వరకూ ఇబ్బంది పడ్డాం..

రాజధాని విషయంలో డైలమా ఉందని, ఇప్పటి వరకూ ఇబ్బందులు పడ్డామని పారిశ్రామిక వేత్తలు ఈ సమావేశంలో తమ బాధను వెలిబుచ్చారు. వైసీపీ హయాంలో మూడేళ్లుగా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. వైవీ సుబ్బారెడ్డి చొరవతో తొలిసారి నేతలతో సమావేశం కావడం, తమ కష్ట సుఖాలు చెప్పుకోవడం సంతోషంగా ఉందని, ఇకపై ధైర్యంగా విశాఖ అభివృద్ధిలో మమేకం అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.


మా సమస్యలివీ..

- విశాఖలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలి.

- విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో ఉన్న ఇండస్ట్రియల్ క్లస్టర్లకు నిరంతరం భారీ వాహనాలు తిరిగేలా చర్యలు తీసుకోవాలి.

- ఐటీ ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చేందుకు అవకాశమివ్వాలి.

- కెమికల్ పార్క్ లో భూ కేటాయింపులు సులభతరం చేయాలి.

- భవన నిర్మాణ అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలి.

- ట్రక్కు, ప్రైవేట్ బస్సుల పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలి.

- మహిళల కోసం ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలి.

- విశాఖలో డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి.

ధీమాగా ఉండండి..

విశాఖకు పరిపాలన రాజధాని వస్తున్న సందర్భంలో నగరానికి మరిన్ని హంగులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. విశాఖ బీచ్ ని ముంబై తరహాలో అభివృద్ధి చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కూడా త్వరలో ప్రారంభమవుతుందన్నారు. రెండేళ్లలో తొలిదశ పనులు పూర్తవుతాయని భరోసా ఇచ్చారు. డ్రగ్ కంట్రోల్ కార్యాలయాన్ని విమ్స్ ఆవరణలో ఏర్పాటు చేయడానికి 2వేల చదరపు గజాల స్థలాన్ని మంజూరు చేశామని చెప్పారు.


ఇక్కడి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారాయన. దేశంలోని టాప్ టెన్ నగరాల్లో విశాఖ ఒకటి అని, విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడానికి ఇక్కడి పెద్దలు సహకరించాలని కోరారు మంత్రి అమర్నాథ్. విశాఖలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం 12 ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామని తెలిపారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖ బీచ్ నుంచి భోగాపురం వరకు ఆరు లైన్ల రోడ్డు నిర్మాణం జరుగుతుందని, మెట్రో రైలు కూడా వస్తుందన్నారు.

ఇప్పటినుంచి మరో లెక్క..

ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టుగా సమావేశం జరిగింది. ఇప్పటి వరకూ విశాఖలో ఇబ్బందులు ఎదురైనా సర్దుకుపోయామని పారిశ్రామిక వేత్తలు చెప్పడం విశేషం. అదే సమయంలో ఇన్ చార్జ్ గా వైవీ సుబ్బారెడ్డి రావడంతో తమకు ధీమా వచ్చిందని, విశాఖ నగర అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని వారు చెప్పారు. అందరూ కలిసి పని చేస్తే విశాఖ పరిపాలనా రాజధానిగా ఆవిర్భవించడానికి మార్గం సుగమం అవుతుందని వైవీ సుబ్బారెడ్డి వారికి భరోసా ఇచ్చారు.

First Published:  15 Sept 2022 8:22 AM IST
Next Story