Telugu Global
Andhra Pradesh

ఓటుకు నోటు కేసు.. ఏపీకి రూ.లక్షన్నర కోట్ల నష్టం

షెడ్యూల్‌ 9కి సంబంధించి 89 సంస్థల విభజన, వాటి ఆస్తుల పంపకంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని స్పష్టం చేసింది వైసీపీ. ఈ ఆస్తుల విలువ దాదాపు రూ. లక్షా 6 వేల 199 కోట్లపైనే ఉంటుందని వెల్లడించింది.

ఓటుకు నోటు కేసు.. ఏపీకి రూ.లక్షన్నర కోట్ల నష్టం
X

2015లో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడు ఆడియో, వీడియోలతో దొరికిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు రూ. లక్షన్నర కోట్ల నష్టం వాటిల్లిందంటూ ట్వీట్ చేసింది వైసీపీ. ఒక తప్పుడు పని వల్ల రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగిందని త‌న ట్వీట్‌లో స్పష్టం చేసింది.

ఓటుకు కోట్లు కేసు వల్ల తెలంగాణలో ఎమ్మెల్సీని కొనబోయి పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నుంచి ఏపీకి చంద్రబాబు పారిపోయి రావాల్సి వచ్చిందని తన ట్వీట్‌లో పేర్కొంది వైసీపీ. ఇక షెడ్యూల్‌ 9, 10 సంస్థల విషయం తేలకుండానే హైదరాబాద్ విడిచిపెట్టాల్సి వచ్చిందని ఆరోపించింది. షెడ్యూల్‌ 9కి సంబంధించి 89 సంస్థల విభజన, వాటి ఆస్తుల పంపకంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని స్పష్టం చేసింది వైసీపీ. ఈ ఆస్తుల విలువ దాదాపు రూ. లక్షా 6 వేల 199 కోట్లపైనే ఉంటుందని వెల్లడించింది.


ఇక షెడ్యూల్‌ 10కి సంబంధించిన సంస్థలు, ఆస్తులు మరో 142 ఉన్నాయని, ప్రభుత్వ లెక్కల ప్రకారం వాటి విలువ మరో రూ. 39,191 కోట్లు ఉంటుందని పేర్కొంది. ఇవేకాక విభజన చట్టంలో లేని ఆస్తులు 12 ఉన్నాయని, వాటి విలువ మరో 1759 కోట్లుగా ఉంటుందని స్పష్టం చేసింది.

2015లో తెలంగాణ మండలికి ఎన్నికలు జరిగిన సందర్భంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కొనుగోలు చేసేందుకు అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లోనే జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో కూడా లీక్‌ అయింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి అమరావతికి తన మ‌కాం షిఫ్ట్ చేశారు. ఈ కేసు కారణంగానే చంద్రబాబు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను విడిచి అమరావతికి వచ్చారన్న ప్రచారం జరిగింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయి జైలు జీవితం కూడా గడిపారు.

First Published:  6 July 2024 5:44 PM IST
Next Story