మోదీతో మీటింగ్, బాబుతో డేటింగ్.. అప్పుడే మొదలైన సెటైర్లు
పవన్ కల్యాణ్ ఎవరితో కలిస్తే మాకేంటి, ప్రధాని మోదీని కలిసినా మాకేంటి అంటున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో ఈ భేటీ గురించి మంత్రులు భుజాలెందుకు తడుముకుంటున్నారంటూ జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
పవన్ కల్యాణ్-మోదీ భేటీని వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. భేటీ జరక్కముందే వైసీపీనుంచి సెటైర్లు పడ్డాయి. సమావేశం ముగిశాక మరింత జోరుగా కామెంట్లు పెడుతున్నారు ఏపీ మంత్రులు. అసలా భేటీని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి బొత్స. సీట్లు లేని బీజేపీ, ఓట్లు లేని జనసేన.. కలిస్తే మాకేం నష్టం లేదన్నారు మరో మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక మోదీ-పవన్ భేటీ ముగిశాక మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో పంచ్ లు విసిరారు. మోదీతో మీటింగ్, బాబుతో డేటింగ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
అవసరం లేదంటూనే అంత ప్రాధాన్యమెందుకు..?
పవన్ కల్యాణ్ ఎవరితో కలిస్తే మాకేంటి, ప్రధాని మోదీని కలిసినా మాకేంటి అంటున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో ఈ భేటీ గురించి మంత్రులు భుజాలెందుకు తడుముకుంటున్నారంటూ జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీ, జనసేన మధ్య వార్ నడుస్తోంది. పవన్-మోదీ భేటీని జనసేన నాయకులు పాజిటివ్ గా ప్రచారం చేసుకుంటుంటే, మీటింగ్ తో సాధించేదేముంది అంటూ వైసీపీ బ్యాచ్ ఎదురుదాడికి దిగుతోంది.
ప్రస్తుతానికి మీటింగ్ పై పవన్ క్లుప్తంగా స్పందించారు. ఈ భేటీతో పెద్దగా జనసేనకు రాజకీయ ప్రయోజనం ఉండే అవకాశం లేదని తేలిపోయింది. ఇక ఏపీలో పవన్ చంద్రబాబుతో ఉండాలా లేదా అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ముగ్గురూ కలవాలా, లేక రెండు పార్టీలే కలవాలా అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది. అందరూ కలసి కట్టుగా వచ్చినా, విడివిడిగా వచ్చినా ఇటు జగన్ మాత్రం సింగిల్ గానే వస్తారని చెబుతున్నారు వైసీపీ నేతలు. మా టార్గెట్ 175, పవన్ టార్గెట్ జస్ట్ 10సీట్లేనంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటున్న పవన్ పొత్తులకే సై అంటున్నారు. కానీ బీజేపీతోనే సందిగ్ధం ఏర్పడింది. ఎక్కువ సీట్లు డిమాండ్ చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ చివరి వరకూ బెట్టు చూపిస్తుందనే అంచనాలున్నాయి. మరి మోదీ సలహా ఏంటో, పవన్ ఆచరణ ఏంటో.. త్వరలోనే బయటపడుతుంది.