రఘురామ ఏ పార్టీయో తేలిపోయిందా..?
టీడీపీ పోటీచేయబోయే 11 నియోజకవర్గాల్లో నరసాపురం సీటు కూడా ఉంది. నరసాపురం అభ్యర్థిగా రఘురామ పోటీచేయబోతున్నట్లు టీడీపీ తేల్చేసింది.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫ/న పోటీచేస్తారో తేలిపోయింది. వచ్చేఎన్నికల్లో నరసాపురం ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేయబోతున్నారు. ఇంతకాలం ఈ విషయాన్ని రఘురామ బయటకు చెప్పకుండా దాచుంచారు. ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననే విషయాన్ని తొందరలోనే ప్రకటిస్తానని గడచిన ఏడాదిన్నరగా నాన్చుతూ వస్తున్నారు. అలాంటిది టీడీపీ-జనసేన మధ్య పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీచేసే అభ్యర్థ/ల జాబితాపై కసరత్తు మొదలైంది. ఆ కసరత్తు ప్రకారం ఇప్పటికి 13 ఎంపీ సీట్లు ఫైనల్ అయ్యాయి.
ఇందులో 11 చోట్ల టీడీపీ పోటీచేస్తుండగా, మిగిలిన రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయబోతోంది. టీడీపీ పోటీచేయబోయే 11 నియోజకవర్గాల్లో నరసాపురం సీటు కూడా ఉంది. నరసాపురం అభ్యర్థిగా రఘురామ పోటీచేయబోతున్నట్లు టీడీపీ తేల్చేసింది. ఈ జాబితా ప్రకారమే రఘురాజు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. రెండుపార్టీల కసరత్తులో వైసీపీని వీడిన ఎంపీలు ముగ్గురికి టికెట్లు దక్కాయి. నరసాపురంలో రఘురాజు పోటీచేస్తుండగా మచిలీపట్నంలో జనసేన తరఫున వల్లభనేని బాలశౌరి, నరసరావుపేటలో టీడీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయులుకు టికెట్ దక్కింది.
ఇంకా ఒకళ్ళిద్దరు ఎంపీలు వైసీపీ లో నుండి వచ్చేస్తారని కూటమి అనుకుంటోంది. వాళ్ళు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ తరఫున ఇప్పుడు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే తిరిగి పోటీ చేయించాలని చంద్రబాబునాయుడు, పవన్ అనుకున్నారు. ఇందులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒకరని తేలింది. మరి రెండో ఎంపీ ఎవరో తొందరలోనే తేలిపోతుంది.
మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో అతికష్టంమీద ఇప్పటికి 13 నియోజకవర్గాలు మాత్రమే ఫైనల్ చేశారు. మిగిలిన 12 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులు దొరకటంలేదు. శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లిలో బైరి దిలీప్ చక్రవర్తి, వైజాగ్ లో భరత్, కాకినాడలో సాన సతీష్ కుమార్, నరసాపురంలో రఘురాజు, ఏలూరులో గోపాల్ యాదవ్, విజయవాడలో కేశినేని చిన్ని, మచిలీపట్నంలో బాలశౌరి, నరసరావుపేటలో శ్రీకృష్ణదేవరాయులు, తిరుపతి(ఎస్సీ) నిహారిక, రాజంపేట సుగవాసి బాలసుబ్రమణ్యం, హిందూపురంలో బీకే పార్ధసారధి, అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు ఎంపీలుగా పోటీచేయబోతున్నారు. మరి మిగిలిన 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎప్పుడు ఫైనల్ చేస్తారో చూడాలి.