ఏడాది క్రితమే ఆ విషయం తెలుసు.. మాధవ్ వీడియోపై కొడాలి నాని కౌంటర్లు..
ఐటీడీపీ, లోకేష్, చంద్రబాబు సమక్షంలోనే ఎంపీ మాధవ్ వీడియో ఎడిటింగ్ జరిగిందని కొడాలి నాని అన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు కాదు.. దమ్ముంటే అసలు వీడియో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
మహిళలను అడ్డు పెట్టుకుని వైసీపీ ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఏడాదిన్నర క్రితం ఇంటెలిజెన్స్ వర్గాలు తమను హెచ్చరించాయని చెబుతున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అందులో భాగంగానే ఎంపీ మాధవ్ వీడియో బయటకు వచ్చిందని చెప్పారు. వైసీపీ నేత తల, టీడీపీ నేతల బాడీలతో ఆ వీడియోలను ఎడిటింగ్ చేస్తున్నారని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదికలు కాదని, టీడీపీ నేతలకు దమ్ముంటే అసలు వీడియో బయట పెట్టాలని డిమాండ్ చేశారు నాని.
ఐటీడీపీ, లోకేష్, చంద్రబాబు సమక్షంలోనే ఎంపీ మాధవ్ వీడియో ఎడిటింగ్ జరిగిందని అన్నారు కొడాలి నాని, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఇలాంటి వ్యవహారాలను పట్టుకుని వేలాడుతున్న టీడీపీని ఇకపై టీఎల్పీగా పిలవాలని అన్నారు నాని. ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్యను కవర్ చేసుకోడానికే.. మాధవ్ మార్ఫింగ్ వీడియోను టీడీపీ తెరపైకి తెచ్చిందని ఆరోపించారు నాని. మాధవ్ వీడియోలో ఎవరికీ కనబడనిది, టీడీపీ నాయకులకు మాత్రమే ఎలా కనపడిందని ప్రశ్నించారు నాని. జగన్ లాగా ప్రజల తరఫున పోరాటం చేయడం చేతకాక.. చంద్రబాబు అండ్ కో మాధవ్ వీడియో పట్టుకుని వేలాడుతున్నారని అన్నారు.
వ్యవస్థలపై పోరాడిన యోధుడు జగన్..
సీఎం జగన్‌కు జాతీయ జెండా ఎగురవేసే అర్హత లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ లాగా వ్యవస్థలతో పోరాడిన యోధుడు సీఎం జగన్ అని అన్నారు నాని. సైకిల్ గుర్తు కోసం అమ్మాయిలను పంపిన చరిత్ర చంద్రబాబుదని, ఇప్పుడు అధికారం కోసం దిగజారి, అమ్మాయిలను అడ్డు పెట్టుకొని వైసీపీ నేతలపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తామని హెచ్చరించారు నాని. జగన్ పబ్జీ ఆడుతున్నారంటూ కామెంట్స్ చేసినవారు.. క్యాంప్ ఆఫీసుకు వచ్చి చూశారా అని ప్రశ్నించారు.