నీవు నేర్పిన విద్యయే 'నారా'జాక్ష
గిర్రున ఐదేళ్లు తిరిగిపోయింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇదే వ్యూహాన్ని అచ్చుగుద్దినట్టు అమలు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. నీవు నేర్పిన విద్యయే నారాజాక్ష అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వికృత రాజకీయ వ్యూహాన్ని పరిచయం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలపై, విధానాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తే.. ఎదురుదాడే మార్గంగా ఎంచుకుంది. విమర్శలకు ప్రతివిమర్శలే తప్పించి వివరణల్లేని వ్యవస్థకి అంకురార్పణ చేసింది. ఆరోపణలకి స్పందించడం అంటే ప్రత్యారోపణలు చేయడమే మార్గంగా కనిపెట్టింది. అధికారంలో చేతిలో ఉన్నంత కాలమూ ఈ వ్యూహాన్నే నమ్ముకుంది టీడీపీ. ఈ ప్లాన్ అమలులోనూ సామాజికవర్గ సమీకరణాలని ఉపయోగించడం టీడీపీయే మొదలుపెట్టింది.
దళిత నాయకులు టీడీపీపై ఆరోపణలు చేస్తే దళితవర్గానికి చెందిన టీడీపీ నేతలపై ఎదురుదాడి వ్యూహం అమలు చేసేవారు. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లపై ప్రశ్నిస్తే, టీడీపీలో కాపు నేతలైన బోండా ఉమామహేశ్వరరావు కౌంటర్ ఇచ్చేవారు. వైసీపీ నుంచి రెడ్డి ప్రతినిధులు ప్రెస్ మీట్ పెడితే రెడ్డి కమ్యూనిటీ నుంచే ఎదురుదాడికి పంపేవారు. మహిళా నేతలపైకి మహిళా నేతలే. ఇదీ చంద్రబాబు కనిపెట్టి అమలు చేసిన వ్యూహం.
గిర్రున ఐదేళ్లు తిరిగిపోయింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇదే వ్యూహాన్ని అచ్చుగుద్దినట్టు అమలు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. నీవు నేర్పిన విద్యయే నారాజాక్ష అంటున్నారు. అసెంబ్లీలో టీడీపీ దళిత ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామిపైకి వైసీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే సుధాకర్ బాబుని పంపడం ఈ వ్యూహంలో భాగమేనంటున్నారు. తన సస్పెన్షన్ గురించి వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ అధినేతపై విమర్శలు ఎక్కుపెట్టింది. దళిత మహిళా ఎమ్మెల్యేపైకి దళిత మహిళా, పురుష నేతల్ని కౌంటర్ ఎటాక్ కి పంపింది వైసీపీ అధిష్టానం.
చంద్రబాబు, లోకేష్‌లని విమర్శించాలంటే అదే సామాజికవర్గానికి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీలను ప్రయోగిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు అమలుచేసిన ఈ సామాజికవర్గ సమీకరణ ఎదురుదాడి వ్యూహం బూమరాంగ్ అయి తనపైకే వైసీపీ ప్రయోగిస్తుందని ఊహించని టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది.