వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స.. రసవత్తరంగా ఎన్నిక
ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ దాఖలు చేస్తారు. విశాఖపట్నం GVMCలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, ZPTCలు, MPTCలు ఓటు హక్కు వినియోగించుకుంటారు.
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ అభ్యర్థిగా మాజీమంత్రి బొత్స సత్యనారాయణను ప్రకటించారు ఆ పార్టీ అధినేత జగన్. ముందుగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించి అభ్యర్థి ఎంపికపై నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. అందరి సూచనలు తీసుకున్న తర్వాత బొత్స పేరును జగన్ ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్‌నాథ్, మాజీఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, కోలా గురువులు పేర్లు కూడా వినిపించాయి. కానీ అధినేత జగన్ మాత్రం బొత్స వైపే మొగ్గు చూపారు.
విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో 2021 డిసెంబరులో రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరిగాయి. వైసీపీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కళ్యాణి ఎమ్మెల్సీలుగా గెలిచారు. వీరిలో వంశీకృష్ణ గతేడాది నవంబరులో వైసీపీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు. వైసీపీ ఫిర్యాదుతో శాసనమండలి ఛైర్మన్ వంశీకృష్ణ శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
ఆగస్టు 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్ దాఖలు చేస్తారు. విశాఖపట్నం GVMCలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, ZPTCలు, MPTCలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎక్స్ ఆఫిషియో మెంబర్లతో కలిసి మొత్తం 841 ఓట్లున్నాయి. ఇందులో వైసీపీకి 615, టీడీపీ, జనసేన, బీజేపీకి 215 ఓట్ల బలముంది. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. స్థానిక సంస్థల్లో వైసీపీదే పైచేయి. దీంతో ఇప్పటికే ప్రలోభాల పర్వం మొదలైంది. GVMCలోని 12మంది కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు. స్థానిక సంస్థల్లో వైసీపీకి బలం ఉండటం, కూటమి అధికారంలో ఉండటంతో ఎన్నిక రసవత్తరంగా మారనుంది.