Telugu Global
Andhra Pradesh

జగన్ ఆదేశాలు పార్టీలోనే అమలుకాలేదా..?

చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే తరఫున ఒక కన్వీనర్, ప్రత్యర్థి వర్గం తరపున మరో కన్వీనర్ పేరు రెడీ అయ్యిందట. మరి మూడో కన్వీనర్ ను ఎవరు ఎంపిక చేయాలి..? అనే విషయంలోనే వివాదాలు రేగుతున్నట్లు తెలుస్తోంది.

జగన్ ఆదేశాలు పార్టీలోనే అమలుకాలేదా..?
X

వినటానికి ఇది విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజమే. ఈనెల 25వ తేదీలోగా పార్టీ తరపున 45 వేలమంది కన్వీనర్లు మరో 5.5 లక్షల మంది గృహసారధుల నియామకం జరగాలని గతంలోనే జగన్ ఆదేశించారు. వీళ్ళ నియామక బాధ్యతలను జగన్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలకు అప్పగించారు. అయితే ఇంతవరకు వీళ్ళ నియామకాలు జరగలేదు. అతి కష్టంమీద సుమారు సగం మంది కన్వీనర్లను మాత్రమే ఎంపిక చేశారు. మరి మిగిలిన సగంమంది కన్వీనర్ల మాటేమిటి..? గృహసారధుల నియామకం సంగతేంటి ?

ఈ ప్రశ్నలకు పార్టీలో ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో సుమారు 15 వేల గ్రామాలున్నాయి. జగన్ ఆదేశాల ప్రకారం ప్రతి 50 ఇళ్ళకు ఇద్దరు కన్వీనర్లు, గృహసారధులు ఇన్చార్జిలుగా ఉండాలి. ఆ 50 ఇళ్ళల్లోని జనాల బాగోగులన్నీ వీళ్ళే చూసుకోవాలి. వలంటీర్ల వ్యవస్ధకు ప్యారలల్ గా కన్వీనర్లు, గృహసారధులు కాన్సెప్టును పార్టీపరంగా జగన్ తీసుకొచ్చారు. వలంటీర్లు ప్రభుత్వం నుండి గౌరవ వేతనాన్ని అందుకుంటున్నారు. గృహసారధులేమో అచ్చంగా పార్టీ తరపున మాత్రమే పనిచేస్తారు.

ఎన్నికల్లో వలంటీర్ల సేవలను ఉపయోగించుకోవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది కాబట్టే జగన్ వ్యూహాత్మకంగా ఎన్నికలనాటికి ఉపయోగపడేట్లుగా కన్వీనర్లు, గృహసారధుల కాన్సెప్టును డిజైన్ చేశారు. అయితే జగన్ ఆలోచన బాగానే ఉంది కానీ, ఆచరణలోకి వచ్చేసరికి సగంకూడా సక్సెస్ కాలేదు. చాలా నియోజకవర్గాల్లో కన్వీనర్ల నియామకాలపై వివాదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలకు నియమాక బాధ్యతలను అప్పగించారు.

చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే తరఫున ఒక కన్వీనర్, ప్రత్యర్థి వర్గం తరపున మరో కన్వీనర్ పేరు రెడీ అయ్యిందట. మరి మూడో కన్వీనర్ ను ఎవరు ఎంపిక చేయాలి..? అనే విషయంలోనే వివాదాలు రేగుతున్నట్లు తెలుస్తోంది. మూడో కన్వీనర్ గా ఒక వర్గమిచ్చిన పేరును ప్రత్యర్థివర్గం వ్యతిరేకిస్తోందట. ఈ కారణంతోనే కన్వీనర్ల నియామకంలో బాగా ఆలస్యమవుతోంది. కన్వీనర్ల నియామకంలోనే గ్రూపుల మధ్య సయోధ్య కుదరకపోతే ఇక గృహసారధుల నియామకాల్లో ఏమి జరుగుతుందో చూడాలి. 25వ తేదీ కూడా వచ్చేసింది మరి వచ్చే నెల 25వ తేదీకన్నా పూర్తవుతుందో లేదో.

First Published:  24 Dec 2022 10:54 AM IST
Next Story