హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీ సత్తా
ఈ ఎన్నికల్లో జానకీరామిరెడ్డిని ఓడించేందుకు టీడీపీ, జనసేన సానుభూతిపరులైన న్యాయవాదులు ఏకమయ్యారు. జానకీరామిరెడ్డికి వైసీపీ లీగల్ సెల్ మద్దతుగా నిలిచింది.
ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించింది. ఎన్నికల్లో న్యాయవాదులు పార్టీలను చూసి ఓట్లేశారన్న ప్రచారం నడుస్తోంది. అధ్యక్ష పదవికి జానకీరామిరెడ్డి, ఉప్పుటూరు వేణుగోపాలరావు, ప్రసాద్‌బాబు పోటీ పడ్డారు. జానకీరామిరెడ్డి, వేణుగోపాలరావు మధ్య లాయర్లు పొలిటికల్ పార్టీల వారీగా ఓట్లేసినట్టు చెబుతున్నారు. కౌంటింగ్ నువ్వానేనా అన్నట్టు సాగగా.. జానకీరామిరెడ్డి చివరకు విజయం సాధించారు. మొత్తం 1,438 ఓట్లు పోలవగా.. జానకీరామిరెడ్డికి 703 ఓట్లు వచ్చాయి. వేణుగోపాలరావుకు 683 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి ప్రసాద్ బాబుకు 38 ఓట్లు వచ్చాయి. దాంతో జానకీరామిరెడ్డి 20 ఓట్లు మెజారిటీలో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో జానకీరామిరెడ్డిని ఓడించేందుకు టీడీపీ, జనసేన సానుభూతిపరులైన న్యాయవాదులు ఏకమయ్యారు. జానకీరామిరెడ్డికి వైసీపీ లీగల్ సెల్ మద్దతుగా నిలిచింది. ఒక న్యాయమూర్తి బదిలీని జగన్‌కు ఆపాదిస్తూ టీడీపీకి అనుకూలమైన న్యాయవాదులు ఇటీవల ఆందోళన చేసిన సమయంలో వారు బార్ అసోసియేషన్ పేరును వాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకు బార్ అసోసియేషన్‌కు సంబంధం లేదని అధ్యక్షుడి హోదాలో జానకీరామిరెడ్డి ప్రకటన కూడా విడుదల చేశారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానకీరామిరెడ్డి విజయం సాధించడం వరుసగా ఇది రెండోసారి. ఒకే వ్యక్తి వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం రెండున్నర దశాబ్దాల తర్వాత తెలుగు హైకోర్టులో ఇదే తొలిసారి. ఉపాధ్యక్షుడిగా సురేష్ కుమార్ విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా సాయికుమార్ గెలిచారు.