ఏరియల్ సర్వే ఈదుకుంటా చేస్తారా?.. వరదపై కూడా బురద రాజకీయాలేనా?: ఎంపీ విజయసాయిరెడ్డి
మరోవైపు ప్రభుత్వ మద్యం విక్రయాలపై కూడా టీడీపీ నేతల ఆరోపణలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇటీవల గోదావరి వరదల సందర్భంగా సీఎం జగన్.. హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. హెలీకాప్టర్ లో తిరిగితే ప్రజల కష్టాలు తెలుస్తాయా? అంటూ చంద్రబాబు ఆరోపించారు.
కాగా, ఈ ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 'అవును చంద్రబాబూ.. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు వరదలొస్తే అందులో ఈదుకుంటూ వెళ్లి పరామర్శించేవాడివి. ఎవరైనా చేసేది ఏరియల్ సర్వేనే. నువ్వేమో హెలికాప్టర్ ఎక్కి కింద వరద కనిపించగానే దూకేసేవాడివి. వరదల్లోనూ బురద జల్లడమే పనిగా పెట్టుకున్నావుగా దుబారా నాయుడు ' అని విమర్శలు చేశారు. మరోవైపు ప్రభుత్వ మద్యం విక్రయాలపై కూడా టీడీపీ నేతల ఆరోపణలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు.
బాబుకు బుర్ర ఉందా?: మంత్రి కారుమూరి
'చంద్రబాబు నాయుడు బుర్ర పనిచేయడం లేదేమో.. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన ప్రస్తుత సమయంలో రాజకీయ విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది' అంటూ మంత్రి కారుమూరి విమర్శించారు. వరద బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. శవరాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని ఆరోపించారు.
వరద ప్రాంతాల్లోని రైతులకు 80 టన్నుల పశుగ్రాసాన్ని అందజేసినట్టు మంత్రి తెలిపారు. లంక గ్రామాల్లో ప్రభుత్వం 20 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయన్నారు.