Telugu Global
Andhra Pradesh

ఆ నైపుణ్యం.. పురందేశ్వరికే సొంతం..

ఎన్టీఆర్‌ కూతురిగా పుట్టిన పురందేశ్వరి ఆయనకే వెన్నుపోటు పొడిచారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీలో చేరి కేంద్రమంత్రి పదవి అనుభవించారని తెలిపారు.

ఆ నైపుణ్యం.. పురందేశ్వరికే సొంతం..
X

ఎప్పటికప్పుడు పార్టీలు మార్చగల నైపుణ్యం పురందేశ్వరికే సొంతమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీలో ఎన్నాళ్లు ఉన్నారో.. కాంగ్రెస్‌కి ఎందుకెళ్లారో.. అక్కడి నుంచి ఎందుకు బయటికొచ్చారో.. బీజేపీలో ఎందుకు చేరారో.. ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు కూడా ఆమె సమాధానం చెప్పలేకపోయారని తెలిపారు. కనీసం ప్రస్తుతం కొనసాగుతున్న బీజేపీలో అయినా ఎన్నాళ్లు ఉంటారో చెప్పగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ ఒక అనుమానం వస్తోందని, పురందేశ్వరి చంద్రబాబుతో విభేదించే టీడీపీ నుంచి బయటికొచ్చారా..? లేక బాబు ప్రయోజనాలను కాపాడటం కోసం ఆయన పంపితేనే వేరే పార్టీల్లో చేరి కోవర్టుగా పనిచేస్తున్నారా..? అని విజయసాయిరెడ్డి నిలదీశారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ ప్రశ్నలు సంధించారు.

ఎన్టీఆర్‌ కూతురిగా పుట్టిన పురందేశ్వరి ఆయనకే వెన్నుపోటు పొడిచారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీలో చేరి కేంద్రమంత్రి పదవి అనుభవించారని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు అధికారం దక్కదని అర్థమై బీజేపీలో చేరారని, బీజేపీలో పదవి తీసుకొని టీడీపీ అధ్యక్షుడైన తన బంధువు చంద్రబాబుకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. అన్ని రంగులు మార్చగల ఆమె నైపుణ్యాన్ని ఏమని పిలవాలని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

రామోజీ రాతలపైనా నిలదీత..

ఎందుకీ ఎంపీలు.. అంటూ ప్రత్యేక హోదా విషయంలో ఈనాడు ప‌త్రిక‌ రాసిన కథనంపై ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటును స్తంభింపజేసిన వైసీపీ ఎంపీలంటూ ఈనాడులోనే రాసింది మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ ఏనాడూ మాట మార్చలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పలు వేదికల‌పై ప్రధాని మోడీ ముందే ప్రత్యేక హోదాతో పాటు పోలవరం సవరించిన అంచనాల అనుమతి గురించి సీఎం జగన్‌ అడిగారని వివరించారు. అయినా ఇవన్నీ రామోజీకి ఎందుకు కనపడలేదో ఆయనకే తెలియాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

First Published:  14 Nov 2023 11:20 AM IST
Next Story