చంద్రబాబు ఈ జన్మలో మారడు.. ఆ విషయం ప్రజలకు అర్థమైంది
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడలోని కరకట్టపై ఉన్న ఇంటికి రెండున్నర గంటల వ్యవధిలో చేరుకోవచ్చని, కానీ చంద్రబాబు 14 గంటలు వాహనంలో ప్రయాణించారని విమర్శించారు.
చంద్రబాబు ఈ జన్మలో మారడనే విషయం ప్రజలకు అర్థమైందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయని కోర్టుకు పత్రాలు సమర్పించడంతో న్యాయస్థానం మానవతా దృక్పథంతో చంద్రబాబుకు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసిందని.. అయితే తానోదో పోరాడి సాధించుకున్నట్టుగా జైలు నుంచి బయటకొచ్చి చంద్రబాబు ఊరేగింపు నిర్వహించారని ఆయన ఎద్దేవా చేశారు.
విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడలోని కరకట్టపై ఉన్న ఇంటికి రెండున్నర గంటల వ్యవధిలో చేరుకోవచ్చని, కానీ చంద్రబాబు 14 గంటలు వాహనంలో ప్రయాణించారని విమర్శించారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే అన్ని గంటలు ఎలా ప్రయాణం చేశారని ఆయన ప్రశ్నించారు. కోర్టు విధించిన ఆంక్షలను చంద్రబాబు ఉల్లంఘించారని చెప్పారు. చంద్రబాబు చర్యలు చూసిన జనం ఆయన ఈ జన్మలో మారడని భావిస్తున్నారన్నారు. 2019 సంవత్సరంలోనే ప్రజా యుద్ధం ముగిసిందని, ఆ యుద్ధంలో టీడీపీ ఓడిపోవడంతోనే దాని పని అయిపోయిందని తెలిపారు.
దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ భుజంపై చేతులు వేసి టీడీపీని చంద్రబాబు నడిపించే యత్నం చేస్తున్నారని సజ్జల విమర్శించారు. ఇక నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఉత్తర కుమార ప్రగల్భాలని చెప్పారు. తండ్రి జైలులో ఉంటే లోకేష్ ఢిల్లీలో కూర్చున్నాడని ఈ సందర్భంగా గుర్తుచేశారు.