Telugu Global
Andhra Pradesh

బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ తరఫున నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోందని కృష్ణయ్య తెలిపారు.

బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు
X

చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకు మాత్ర‌మే వాడుకున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. సరైన పదవులు కూడా ఇవ్వకుండా బీసీలను అవమానపరిచారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీల ఆర్థిక‌, రాజ‌కీయ అభ్యున్న‌తి సీఎం జగన్‌ హయాంలో బాగా పెరిగిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

సీఎం జగన్‌ కుల గణన నిర్ణయం హర్షణీయమని ఆర్‌.కృష్ణ‌య్య తెలిపారు. కులాల లెక్కలు తీయటానికి పాలకులు భయపడతారని, కానీ, జగన్‌ ఎంతో ధైర్యంగా ఆ పని చేస్తున్నారని కొనియాడారు. వైసీపీ 18 మందికి ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇస్తే.. అందులో 11 మంది బీసీలే ఉన్నార‌ని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ తరఫున నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోందని కృష్ణయ్య తెలిపారు.

బీసీల అభ్యున్నతికి జగన్‌ చేస్తున్న సహాయం మరువలేనిదని కృష్ణయ్య చెప్పారు. దేశమంతా సీఎం జగన్‌ నిర్ణయాలను మెచ్చుకుంటున్నారని, రానున్న రోజుల్లో మరింత సంక్షేమం బీసీలకు అందుతుందని స్పష్టం చేశారు. గుడిసెలో ఉండేవారు సైతం డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని, పిల్లల చదువులతో కుటుంబాల జీవితాలు మారిపోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. విదేశాల్లో మనవాళ్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారని తెలిపారు. జగన్‌ చేపట్టినన్ని సంస్కరణలు మరెవరూ చేయలేదని కృష్ణయ్య వివరించారు.

లోటు బడ్జెట్‌ ఉన్నా మెరుగైన సంక్షేమం అందిస్తున్నది జగన్‌ మాత్రమేన‌న్నారు. ఇతర నాయకులు జనాన్ని ఓటర్లుగా మాత్రమే చూస్తారని చెప్పారు. జగన్‌ మాత్రమే తమ కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని తెలిపారు. అందుకే వారందరికీ ఆయన మేలు చేస్తున్నారని ఆయన వివరించారు. కులాల లెక్కలు తీయటం వలన రిజర్వేషన్లు పెరుగుతాయని, పదవులు ఇంకా పెరుగుతాయని కృష్ణయ్య స్పష్టం చేశారు.

First Published:  22 Nov 2023 1:19 PM GMT
Next Story