Telugu Global
Andhra Pradesh

వారి ప్రలోభాల్లో పడితే 20 ఏళ్లు వెనక్కి వెళతాం

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాలనలో బీసీలు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు. మళ్లీ సీఎంగా జగన్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

వారి ప్రలోభాల్లో పడితే 20 ఏళ్లు వెనక్కి వెళతాం
X

రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో బీసీలను ప్రలోభాలకు గురిచేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, వారి వలలో చిక్కుకోవద్దని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య సూచించారు. వారి ప్రలోభాల్లో పడితే బీసీ ప్రజలు ఇరవయ్యేళ్లు వెనక్కి వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిపారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇంకా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాలనలో బీసీలు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు. మళ్లీ సీఎంగా జగన్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెడితే.. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు దానిని ఎత్తేశాడని విమర్శించారు.

ప్రతిపక్షాల ప్రలోభాల్లో చిక్కుకుంటే మరోసారి ఇబ్బందులు పడటం ఖాయమని కృష్ణయ్య హెచ్చరించారు. మన పిల్లలు అభివృద్ధి చెందాలంటే సీఎంగా జగన్‌ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసమే సీఎం జగన్‌ పుట్టారని ఆయన కొనియాడారు. అధికారంలో, పథకాల్లో, పదవుల్లో 50 శాతం అవకాశాలను సీఎం జగన్‌ బీసీలకే ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

First Published:  7 Jan 2024 6:37 PM IST
Next Story