పవన్‌కు రాజకీయ నాయకుడి లక్షణాలే లేవు ..
పదవికి రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ తనను డిమాండ్ చేస్తున్నారని, తనను రాజీనామా చేయాలని అనడానికి ఆయన ఎవరు..? అని ఎంపీ సత్యనారాయణ ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాజకీయ నాయకుడి లక్షణాలే లేవని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విమర్శించారు. వీధి రౌడీకి.. పవన్‌కు తేడా లేదు అని ఆయన మండిపడ్డారు. ఆదివారం ఎంపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తాను విశాఖను వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఎప్పుడూ చెప్పలేదని, పవన్ కళ్యాణ్ తన మాటలను వక్రీకరిస్తున్నాడని అన్నారు.
పదవికి రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ తనను డిమాండ్ చేస్తున్నారని, తనను రాజీనామా చేయాలని అనడానికి ఆయన ఎవరు..? అని ఎంపీ సత్యనారాయణ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని, రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడన్నారు. అలాంటిది ఎంపీగా గెలిచిన నా గురించి మాట్లాడే అర్హతే పవన్‌కు లేదన్నారు.
విశాఖలో ప్రభుత్వం కడుతున్న నిర్మాణాల గురించి పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని, మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అసలు విశాఖపట్టణాన్ని ఏం చేయాలనుకుంటున్నారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.
పవన్‌కు కనీస పరిజ్ఞానం కూడా లేదని, అతడికి మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో కూడా తెలియదన్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకొని అతడి బూట్లు నాకుతున్నాడని, జనసేన పార్టీని బాబుకు తాకట్టు పెట్టాడని విమర్శించారు. సినిమాల్లో గంతులు వేసినంతమాత్రాన రాజకీయ నాయకులు అయిపోరని ఎంపీ మండిపడ్డారు.