అవినాష్ రెడ్డి మృధుస్వభావి- గోరంట్ల మాధవ్
తనకు తెలిసినంత వరకు సీబీఐ ఎక్కడో పొరపాటు చేస్తోందన్నారు. దయచేసి సీబీఐ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేయాలని కోరారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిపై ఆరోపణలను ఎంపీ గోరంట్ల మాధవ్ కొట్టిపారేశారు. అవినాష్ రెడ్డి ఒక మృధుస్వభావి అని, ఎలాంటి నేర మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదన్నారు. టీడీపీ హయాంలోనే వివేకానందరెడ్డి హత్యజరిగిందని.. మూడు నెలల పాటు టీడీపీ వేసిన సిట్ విచారణ జరిపిందని.. ఒకవేళ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంటే అప్పుడు చంద్రబాబు వదిలిపెట్టి ఉండేవారా అని ప్రశ్నించారు. చంద్రబాబు చాలా తెలివిగా వైఎస్ సునీత భుజాల మీద నుంచి తుపాకీ పెట్టి వైసీపీని కాల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వైఎస్ సునీత చంద్రబాబుకు భుజం ఇవ్వడం మానుకోవాలన్నారు.
తాను పోలీస్‌గా పనిచేసి వచ్చానని.. దస్తగిరి అనే వ్యక్తిని అప్రూవర్‌గా మార్చుకుని ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటున్నారని.. దస్తగిరి సాక్ష్యంతోనే అరెస్ట్‌లు చేస్తామంటే కుదరదన్నారు. టీవీ5, ఏబీఎన్, ఈటీవీలు సీబీఐని రెచ్చగొడుతున్నాయని మాధవ్ విమర్శించారు. విచారణ వేగంగా సాగినప్పుడు సీబీఐని ప్రశంసిస్తూ.. నెమ్మదిగా ఉన్నప్పుడు మాత్రం సీబీఐకి దమ్ము లేదా?, ధైర్యం లేదా? అంటూ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టం అన్నట్టుగా వార్తలు రాయడం సరికాదన్నారు. మీడియా సంస్థలనూ ఈ కేసులో విచారించాల్సిన అవసరం ఉందన్నారు.
తనకు తెలిసినంత వరకు సీబీఐ ఎక్కడో పొరపాటు చేస్తోందన్నారు. దయచేసి సీబీఐ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేయాలని కోరారు. అవినాష్ రెడ్డి అమాయకుడు అన్న విషయాన్ని సుప్రీంకోర్టు గ్రహించి ముందస్తు బెయిల్ ఇస్తుందని గోరంట్ల మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారతంలో తొలుత ధుర్యోధనుడు గెలిచినా ఆఖరిలో పాండవులే గెలిచారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందన్నారు.