Telugu Global
Andhra Pradesh

ఆదాల రాజకీయ ప్రస్థానం

వైసీపీ కండువా కప్పుకున్న ఆదాల నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేశారు. పార్లమెంట్‌లో నెల్లూరు నియోజకవర్గం అవసరాలను ప్రశ్నల రూపంలో లేవనెత్తడంలో విజయవంతం కావడం ఆయనకు కలిసొచ్చింది.

ఆదాల రాజకీయ ప్రస్థానం
X

ఏపీ రాజకీయాల్లో ఒక జర్క్‌. రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఆదాల ప్రభాకర రెడ్డి పోటీ చేస్తారని స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదాల రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో చూద్దాం..



తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలోకి!

ఆదాల ప్రభాకరరెడ్డి పొలిటికల్‌ ఎంట్రీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు జిల్లా అల్లూరు నియోజకవర్గం నుంచి 1999లో పోటీ చేసి గెలిచారు. అప్పటికి చాలా దఫాలు అల్లూరు నియోజకవర్గంలో టీడీపీ - కమ్యూనిస్టు పార్టీల పొత్తులో భాగంగా సీపీఎం పోటీ చేస్తుండేది. జక్కా వెంకయ్య గెలుస్తుండేవారు. సీపీఎంతో పొత్తు నుంచి బయటకు వచ్చిన టీడీపీకి ఆ సమయంలో బలమైన అభ్యర్థి అవసరం ఉండింది. ఆ నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌లో వ్యాపార రంగంలో స్థిరపడిన ఆదాల ప్రభాకరరెడ్డికి రాజకీయం మీద వ్యామోహం మొదలైన తొలి రోజులవి. చంద్రబాబు అవసరం ఆదాల ఆసక్తి కొత్త సమీకరణాలకు తెర తీసింది. ఇక అప్పటి వరకు ఎర్రజెండాకు మద్దతిస్తూ వచ్చిన అల్లూరు తెలుగుదేశం అభిమానులను ‘తన సొంత జెండాను గెలిపించుకోవడం’ అనే ఉత్సాహం ఉర్రూతలూగించింది. అన్నీ కలిసి అలా ఆదాల తొలి ప్రయత్నంలో భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. అడుగు పెట్టడం పెట్టడమే గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేసేశారు. సీన్‌ కట్‌ చేస్తే..

సోమిరెడ్డి వ్యూహం!

వ్యాపార రంగంలో ఘనాపాటి అయిన ప్రభాకరరెడ్డికి రాజకీయ వ్యూహాలు పూర్తిగా కొత్త. అదే జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పూర్తి స్థాయి రాజకీయవేత్త, పైగా మంత్రి పదవి మీద ఆయనకు అంతులేని ఆకాంక్ష. తనకు మంత్రి పదవి ఇప్పించుకోవడం కోసం జిల్లాలో చాపకింద నీరులాగ మద్దతుదారులను కూడగట్టుకోవడం వంటి వ్యూహాలకు తెరతీశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడో ఏట మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సోమిరెడ్డిని మంత్రి పదవి వరించింది. ఒక జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వరాదనే రాజకీయ సంప్రదాయంలో భాగంగా ఆదాలకు మంత్రి పదవి దూరమైంది. సింపుల్‌గా ఒక్కవాక్యంలో చెప్పాలంటే.. ఆదాలను మంత్రి పదవి నుంచి తప్పించడానికి సోమిరెడ్డి పన్నిన వ్యూహం విజయవంతమైంది. అది ఆదాలకు పెద్ద షాక్‌. దెబ్బతిన్న పులిలా ఉన్న ఆదాలను ఆ తర్వాత పరిణామాలు కొత్త బాటలో నడిపించాయి.

సోమిరెడ్డి మీద పోటీ!

ఆ తర్వాత అంటే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదాల ప్రతీకార రాజకీయం చేశారు. ‘చాపకింద నీరులా వ్యూహాలు పన్నడం కాదు, తనతో నేరుగా పోటీ చేసి గెలవ’మని సవాల్‌ విసిరి మరీ సోమిరెడ్డి మీద స్వయంగా పోటీ చేశారు. అలా ఆదాల అల్లూరు నుంచి సర్వేపల్లికి మారారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మీద పోటీ చేయడం కోసం పార్టీ మారడం కూడా అనివార్యం అయింది. అప్పుడు ఆదాలకు కలిసి వచ్చిన సమీకరణ ఏమిటంటే.. అప్పటికి వైఎస్సార్‌ పాదయాత్రతో కాంగ్రెస్‌కు మంచి ఊపు తెచ్చారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో జనం కొంత విసిగి ఉన్నారు. ఆదాలకు అవి కూడా కలిసి వచ్చాయి. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందని వ్యక్తి అయినప్పటికీ సర్వేపల్లి ఓటర్లు నీరాజనం పట్టారు. సోమిరెడ్డిని ఓడించడంలో విజయవంతమైన ఆదాల అంతటితో సంతృప్తి చెంది.. తిరిగి తన నియోజకవర్గానికి వెళ్లడానికి వీల్లేకుండా 2009 నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అల్లూరు నియోజకవర్గం రద్దయిపోయింది. దాంతో ఆ ఎన్నికల్లోనూ సర్వేపల్లి నుంచే పోటీ చేసి గెలిచారు.


నెల్లూరు కల నెరవేరింది!... కానీ

ఆదాల తన పొలిటికల్‌ కెరీర్‌ని స్థిరపరుచుకోవడానికి నెల్లూరు మీద మనసుపడ్డారు. కానీ ఆనం కుటుంబం విస్తరించి ఉండడంతో క్లియర్‌ వ్యాక్యూమ్‌ లేకపోయింది. నెల్లూరు రూరల్‌ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పడినప్పటికీ ఆనం బ్రదర్స్‌ ఇద్దరూ పోటీ చేయడంతో ఆ అవకాశం చేజిక్కలేదు. అయితే 2019 నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌ రెడ్డి చేతిలో 13 వేల ఓట్ల తేడాతో ఓటమిని చూశారు. ఆ తర్వాత వైసీపీలో అనూహ్యంగా మారిన సమీకరణల నేపథ్యంలో మేకపాటి కుటుంబంతో వైసీపీ చేసుకున్న ఒడంబడికలో భాగంగా ఆదాల ప్రభాకరరెడ్డి 2019లో నెల్లూరు ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి బరిలో దిగి దాదాపుగా లక్షన్నర పై చిలుకు ఓట్లతో పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.


వైసీపీ కండువా!

నిజానికి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు రూరల్‌ స్థానంలో పోటీ చేసే అవకాశం ఆదాల ఎదుట ఉండింది. అయితే వైసీపీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా వైసీపీ కండువా కప్పుకున్న ఆదాల నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేశారు. పార్లమెంట్‌లో నెల్లూరు నియోజకవర్గం అవసరాలను ప్రశ్నల రూపంలో లేవనెత్తడంలో విజయవంతం కావడం ఆయనకు కలిసొచ్చింది. నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు సొంత వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయ పదవిని మకుటంలా ఆస్వాదిస్తారనే అపవాదును కొంత వరకు తొలగించగలిగారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం గుర్తింపు కూడా పొందారు. ఆదాల రాజకీయాల్లో అంటీముట్టనట్లు ఉంటారనే అపవాదును తుడిచి వేసుకోవడానికి కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ‘మౌనముని’గా ముద్ర వేసుకున్న ఆదాల పట్ల స్థానికుల్లో వివాదరహితుడు అనే సదభిప్రాయం ఉంది.

ఇది వైసీపీ మార్కు!

ఇక వైసీపీ ప్రతి జిల్లాలో ఇద్దరు - ముగ్గురు నాయకులను తెర వెనుక సిద్ధం చేసుకుంటోంది. వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్న స్థానాల్లో వీరిని రంగ ప్రవేశం చేయించడం వైసీపీ మార్కు రాజకీయం. అలా నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీతోపాటు మరికొన్ని నియోజకవర్గాలకు ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది ఆ పార్టీ. అందులో భాగంగా ఆదాలకు అసెంబ్లీ స్థానాల మీద దృష్టి పెట్టమనే ఆదేశాలు ఏడాది కిందటే అందాయి. అయితే ఈ అస్త్రాన్ని నెల్లూరు రూరల్‌ స్థానంలో వాడాల్సి వస్తుందని ఆదాల కాదు కదా వైసీపీ కూడా ఊహించి ఉండదు.

First Published:  3 Feb 2023 6:10 PM IST
Next Story