జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ.. విశాఖలో టికెట్ దక్కేనా..?
గత ఎన్నికల్లో వైసీపీ వైపు వీచిన గాలి జనసేన వైపు మళ్లుతుందని పవన్ ఈ సందర్భంగా అన్నారు. పార్టీలో చేరినవారిని మర్చిపోనని చెప్పారు.
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అందరూ ఊహించినట్లుగానే జనసేనలో చేరిపోయారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వంశీ ప్రజారాజ్యంలో పోటీ చేసినప్పటి నుంచి తనకు తెలుసని, ఇప్పుడు జనసేనలో చేరడం సంతోషమని పవన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసీపీ వైపు వీచిన గాలి జనసేన వైపు మళ్లుతుందని పవన్ ఈ సందర్భంగా అన్నారు. పార్టీలో చేరినవారిని మర్చిపోనని చెప్పారు.
వంశీకృష్ణ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 4వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి 2014లో మరోమారు ఓడిపోయారు. 2019లో టికెట్ ఇవ్వకున్నా రెండేళ్ల కిందట స్థానిక సంస్థల నుంచి ఆయన్ను జగన్ శాసన మండలికి పంపారు. అయినా ఇప్పుడు పార్టీని వదిలి జనసేనలోకి వెళ్లడం గమనార్హం.
భీమిలి లేదా విశాఖ తూర్పు టికెట్ కావాలట..!
గత ఎన్నికల్లో తనకు టికెట్ దక్కలేదు.. ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి వచ్చే ఎన్నికల్లోనూ అసెంబ్లీ టికెట్ రాదని వంశీ ఫిక్సయిపోయారు. అందుకే టికెట్ వచ్చే పార్టీలోకి వెళ్లిపోయారని వైసీపీ క్యాడరే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో భీమిలి లేదా విశాఖ తూర్పు టికెట్ ఇస్తామనే హామీ తీసుకునే ఆయన జనసేనలో చేరారని రాజకీయ వర్గాల కథనం.
టీడీపీ కంచుకోటను జనసేనకి ఇస్తారా?
అయితే పొత్తులో ఆ సీటు జనసేనకు దక్కాలి కదా అన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల్లోనే ఉండటం గమనార్హం. ఎందుకంటే విశాఖ తూర్పులో 2009, 2014, 2019ల్లో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు హ్యాట్రిక్ కొట్టారు. మొన్న ఎన్నికల్లో ఉత్తరాంధ్రంతా వైసీపీ ఊడ్చేసినా రామకృష్ణబాబు పట్టు సడలలేదు. 20వేలకు పైగా మెజార్టీతో గెలిచారు. పైగా చంద్రబాబు సొంత సామాజికవర్గం వ్యక్తి. ఇంత కీలకమైన నియోజకవర్గాన్ని టీడీపీ జనసేనకు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాంటప్పుడు వంశీ వైసీపీలోకి జనసేనలోకి వచ్చి ఉపయోగమేంటో మరి! భీమిలి ఇచ్చినా ఆయనకు అక్కడ అంత పట్టులేదని చెబుతున్నారు.