ఎట్టకేలకు ముసుగు తొలగించిన పార్థసారథి, వసంత
టీడీపీలో చేరడం ఖాయమే అయినా ఇన్నాళ్లూ ముసుగు వేసుకుని వ్యవహారం నడిపిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు ఆ ముసుగు తీసేశారు.
టీడీపీలో చేరకుండానే టికెట్ తెచ్చేసుకున్న ఘనుడు ఒకాయన.. ఎన్నాళ్ల నుంచో టీడీపీలో ఉంటున్న ఉమాను పక్కనపెట్టి తనకే టికెట్ ఖరారు చేయించేసుకున్న పెద్దమనిషి మరొకరు.. వీళ్లిద్దరూ ఎట్టకేలకు ముసుగు తొలగించారు. టీడీపీలో చేరుతున్నామని ప్రకటించారు. వారే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీడీపీ పంచన చేరిన కొలుసు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్.
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతా: వసంత
టీడీపీలో చేరడం ఖాయమే అయినా ఇన్నాళ్లూ ముసుగు వేసుకుని వ్యవహారం నడిపిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు ఆ ముసుగు తీసేశారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని చెప్పారు. మైలవరంలో టీడీపీ సీనియర్ దేవినేని ఉమాతో తనకేం వ్యక్తిగత విబేధాల్లేవని, టికెట్ విషయంలో చంద్రబాబు సమక్షంలోనే ఆయనతో మాట్లాడుకుంటానని చెప్పుకొచ్చారు. టికెట్ గ్యారంటీ అనే హామీ ఇచ్చాకే వసంత టీడీపీలో చేరుతున్న సంగతి మైలవరం నియోజకవర్గంలో చిన్నపిల్లాడికి కూడా తెలుసు. కానీ వసంతే పిల్లి కళ్లుమూసుకుని పాలు తాగుతున్న చందంగా చేస్తున్నారు.
చంద్రబాబును, లోకేశ్‌ను తిట్టమన్నారు.. మనసొప్పలేదట!
చంద్రబాబును, లోకేశ్‌ను వ్యక్తిగతంగా తిట్టమని జగన్ చెప్పారు. నాకు మైలవరం టికెట్ ఇస్తామంటూనే వ్యక్తిగత దూషణలు చేయమన్నారు. కానీ నేను ఆ పని చేయలేకే వైసీపీని వదిలేశా. రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా దూషిస్తేనే వైసీపీలో మంత్రి పదవులొస్తాయని ముక్తాయించేశారు.
టికెట్ ఇచ్చిన మూడు రోజులకు టీడీపీలోకి
ఏ పార్టీ అయినా దీర్ఘకాలంగా సేవలందించినవారికి లేకపోతే ప్రజాదరణ ఉన్నవారికి ఎన్నికల్లో టికెట్లిస్తుంది. కానీ టీడీపీలో అదేం విచిత్రమో గానీ పార్టీలో చేరకముందే టికెట్లిచ్చేస్తున్నారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథితో ముందే మాట్లాడుకుని.. ఆయనకు నూజివీడు టికెట్ కట్టబెట్టేశారు టీడీపీ వాళ్లు. టికెట్ ఇచ్చిన మూడు రోజులకు తాయితీగా ఈరోజు ఆయన టీడీపీలో చేరతారట!