కోటంరెడ్డి, ప్రసన్నకుమార్, కారుమూరి హర్ట్ అయ్యారా..?
గడప గడపకు ఆద్యుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని అని ఆ కథనంలో ప్రచురించారు. గడప గడపకు కార్యక్రమం కంటే ముందే ''జగనన్న మాట.. గడప గడపకు శ్రీధర్ రెడ్డి బాట'' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు.
పనితీరు బాగోలేని 27 మంది ఎమ్మెల్యేల జాబితాలో తమ పేర్లనూ చేర్చడంపై కొందరు ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. 27 మందిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక స్థానిక పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్టు చేశారు. పరోక్షంగా ఆ కథనంలోని అభిప్రాయాలను ఆయన సమర్థించారు.
గడప గడపకు ఆద్యుడు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని అని ఆ కథనంలో ప్రచురించారు. గడప గడపకు కార్యక్రమం కంటే ముందే ''జగనన్న మాట.. గడప గడపకు శ్రీధర్ రెడ్డి బాట'' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. మొన్నటి వరకు ఆదర్శం అన్నారు.. నేడు ఏమైందని ఆ కథనంలో ప్రశ్నించారు. సమాచార లోపమేనా లేక ఏదైనా కారణం ఉందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండే శ్రీధర్ రెడ్డి పేరు కూడా జాబితాలో చేర్చి ఉంటే అని ఆయన నిబద్దతకే అవమానం అని కథనంలో రాశారు. ఆ కథనంతో నేరుగా కోటంరెడ్డికి సంబంధం లేకపోయినా.. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడం ద్వారా శ్రీధర్ రెడ్డి తనలోనూ అదే అభిప్రాయం ఉందని పరోక్షంగా వెల్లడించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరును 27 మంది జాబితాలో చేర్చడంపై ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా స్పందించారు. శ్రీధర్ రెడ్డి తిరిగినట్టుగా మరే ఎమ్మెల్యే కూడా తిరగలేదని.. గడప గడపకు కార్యక్రమం కంటే ముందే ఆయన నియోజకవర్గంలో 90 శాతం పర్యటించారని ప్రసన్నకుమార్ రెడ్డి వివరించారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి చాలా కాలం క్రితమే యాక్సిడెంట్ అయి పాదం దెబ్బతిందని.. ఆయన అందరిలా వేగంగా తిరగడం సాధ్యపడడం లేదన్నారు.
అటు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా తన పేరు జాబితాలో ఉండడంపై స్పందించారు. పని చేయని ఎమ్మెల్యేల జాబితాలో తన పేరు రావడం పొరపాటుగా జరిగి ఉంటుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. తాను చేస్తున్న కార్యక్రమాలు సరిగా నమోదు కావడం లేదన్నారు. తాను గెలవలేను అనుకుంటే మరొకరికి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నానని చెప్పారు.