Telugu Global
Andhra Pradesh

మీరంటే జగన్‌కు ఇష్టం.. ఈ ఏడాది సహకరించండి

వలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారిపై వైసీపీ నాయకులెవరూ ఎలాంటి పెత్తనం చేయలేదని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు.

మీరంటే జగన్‌కు ఇష్టం.. ఈ ఏడాది సహకరించండి
X

వలంటీర్ల వ్యవస్థ కారణంగా ఒక విధంగా సొంత పార్టీకే జగన్మోహన్ రెడ్డి నష్టం చేసుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల ప్రమేయం ఉంటే పథకాల మంజూరులో వివక్షకు అవకాశం రావొచ్చన్న ఉద్దేశంతో వలంటీర్ల వ్యవస్థను తెచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేశారు జ‌గ‌న్‌. వలంటీర్ల వ్యవస్థ కారణంగా తమకు ఎలాంటి విలువ లేకుండా పోయిందన్న భావన వైసీపీ శ్రేణుల్లో ఉంది. అయినప్పటికీ ప్రజలకు మాత్రం మంచి జరిగింది. అయితే ఎన్నికల ఏడాది సమీపిస్తుండటంతో వలంటీర్లు తమ పార్టీకి కొద్దిగా సహకరించాలని వైసీపీ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.

జగనే ఇస్తున్నారని చెప్పండి- హోంమంత్రి

పింఛన్లు ఎవరిస్తున్నారని తాము అడిగితే కొందరు లబ్దిదారులు వలంటీర్లు ఇస్తున్నారని చెబుతున్నారని.. అలాంటి వారికి పథకాలను ఇస్తున్నది జగన్‌మోహన్ రెడ్డి అన్న విషయాన్ని వలంటీర్లే వివరించాలని హోంమంత్రి తానేటి వనిత సూచించారు. 13ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకుల కంటే వలంటీర్లకే జగన్‌ మోహన్ రెడ్డి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని వలంటీర్లు గుర్తించాలని కోరారు. తాను నిర్వహించిన కార్యక్రమానికి వలంటీర్లు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడంపైనా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పిలుపునిచ్చినా సమావేశానికి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. హాజరు కాని వలంటీర్లు జనవరి 2న‌ తనను కలవాల్సింది ఆమె చెప్పారు.

మాకు ఉపయోగపడండి.. మేం దారి చూపిస్తాం- రాపాక

వలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారిపై వైసీపీ నాయకులెవరూ ఎలాంటి పెత్తనం చేయలేదని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు వస్తున్నది ఎన్నికల ఏడాది కాబట్టి వలంటీర్లు తమకు సహకరించాలని కోరారు. వైసీపీ గెలుపున‌కు ఉపయోగపడేలా నేతలు చెప్పినట్టుగా వలంటీర్లు నడుచుకోవాలని సూచించారు. మీరు మాకు ఉపయోగప‌డితే.. మేం మీకు దారి చూపిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఎన్నికల సమయంలో వలంటీర్లు విధుల్లో ఉండే అవకాశం ఉండకపోవచ్చని.. అందుకే సచివాలయ కన్వీనర్ల ద్వారా పథకాలను అందించాలనుకుంటున్నామని.. కాబట్టి వలంటీర్లు కన్వీనర్లకు సహకరించాలని కోరారు. వలంటీర్లు అంటే జగన్‌మోహన్ రెడ్డికి ఎంతో ఇష్టమన్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామంలో గ్రామ వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాపాక పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించేందుకు వలంటీర్లతో పాటు కొత్తగా నియమితులైన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు సమష్టిగా కృషి చేయాలని పాలకొండ ఎమ్మెల్యే కళావతి విజ్ఞప్తి చేశారు. పాలకొండలో జరిగిన వలంటీర్ల సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

First Published:  1 Jan 2023 9:13 AM IST
Next Story