నారా లోకేష్‌ని అల్లుడితో పోల్చిన వైసీపీ ఎమ్మెల్యే.. సెటైర్ల వర్షం
చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారని.. కానీ ఆయన పాదయాత్ర వల్ల రాష్ట్ర ప్రజలకి చేకూరే లబ్ధి ఏమీలేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు.

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సెటైర్లు వర్షం కురిపించారు. ప్రస్తుతం నంద్యాలలో ఈ పాదయాత్ర నడుస్తుండగా.. త్వరలోనే ప్రొద్దుటూరులోకి అడుగు పెట్టనుంది. దాంతో పాదయాత్రని మీరు అడ్డుకుంటారా..? అని ప్రశ్నించగా ఆయన ఫన్నీగా సమాధానమిచ్చారు.
చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి నారా లోకేష్ పాదయాత్ర చేపడుతున్నారని.. కానీ ఆయన పాదయాత్ర వల్ల రాష్ట్ర ప్రజలకి చేకూరే లబ్ధి ఏమీలేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకే కాదు.. ఆ పాదయాత్రతో టీడీపీకి కూడా నయా పైసా ఉపయోగం ఉండదని ఎమ్మెల్యే సెటైర్ వేశారు. కాబట్టి ప్రొద్దుటూరులో నారా లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటే అనవసరంగా అతనికి మైలేజ్ ఇచ్చినట్లు అవుతుందని చెప్పుకొచ్చిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. అల్లుడిలా సైలెంట్‌గా వచ్చి అతను వెళ్లిపోతాడన్నారు. ఆఖరిగా నారా లోకేష్‌పై నమ్మకం ఉంచి ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలోనైనా ఒక్క నాయకుడైనా టీడీపీలో చేరారా..? అంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు.
వాస్తవానికి నారా లోకేష్ ఈ పాదయాత్రని ఇంతలా కొనసాగిస్తాడని టీడీపీ నాయకులు కూడా బహుశా ఊహించలేదు. సుకుమారంగా పెరిగిన నారా లోకేష్ వేసవిలో కూడా పట్టుదలతో పాదయాత్రని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 100 రోజులు ఈ పాదయాత్ర పూర్తి చేసుకోగా.. సుమారు 1300కి.మీ నారా లోకేష్ నడిచారు. వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ అతను పాదయాత్రని కొనసాగిస్తున్నారు.