Telugu Global
Andhra Pradesh

ప్రజలు ‘నిన్ను నమ్మం బాబు..’ అంటున్నారు.. - ఎమ్మెల్యే మల్లాది విష్ణు

సీఎం జగన్‌ని ఢీకొట్టే సత్తాలేక చంద్రబాబు ఇతర పార్టీలను కలుపుకుంటున్నాడని మల్లాది ఎద్దేవా చేశారు. కుర్చీ కోసం పాకులాడటం తప్ప.. ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన ఆయనకు లేదని మల్లాది విమర్శించారు.

ప్రజలు ‘నిన్ను నమ్మం బాబు..’ అంటున్నారు.. - ఎమ్మెల్యే మల్లాది విష్ణు
X

ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. శుక్రవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మల్లాది విష్ణు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఏపీ శ్రీలంక అయిపోతుందన్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆరు గ్యారంటీలిస్తానంటున్నాడని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ‘నిన్ను నమ్మం బాబు..’ అంటున్నారని ఆయన తెలిపారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వంపై పనిగట్టుకుని బురద జల్లుతున్నారని, దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని చంద్రబాబు, పవన్‌లపై మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న ’మనసులో మాట’ పుస్తకాన్ని బయటపెట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై.. వైసీపీ ఐదేళ్ల పాలనపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు రెడీ అని సవాల్‌ చేశారు. గతంలో సీపీఐ ఆధ్వర్యంలోనే ‘బాబు జమానా.. అవినీతి ఖజానా’ అనే పుస్తకం వేశారని మల్లాది విష్ణు గుర్తుచేశారు.

సీఎం జగన్‌ని ఢీకొట్టే సత్తాలేక చంద్రబాబు ఇతర పార్టీలను కలుపుకుంటున్నాడని మల్లాది ఎద్దేవా చేశారు. కుర్చీ కోసం పాకులాడటం తప్ప.. ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన ఆయనకు లేదని మల్లాది విమర్శించారు. ఐదేళ్లలో విజయవాడ నగరానికి ఒక్క మంచి పనైనా చేశాడా.. విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

నువ్వు పరిపాలనకు పనికిరావు బాబూ.. అంటూ విష్ణు విమర్శించారు. ప్రభుత్వంపై బురదజల్లాలనే ‘విధ్వంసం’ పుస్తకం తెచ్చారని మండిపడ్డారు. ఏపీలో పొత్తులు తేలిన తర్వాత ఎవరిపై ఎవరు రాళ్లు విసురుతారో.. ఎవరి కుర్చీ ఎవరు మడతపెడతారో తేలిపోతుందని ఆయన చెప్పారు. పొత్తులు ప్రకటించాక మంచి వినోదం మొదలవుతుందని, ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయని ఆయన తెలిపారు.

First Published:  17 Feb 2024 8:37 AM IST
Next Story