Telugu Global
Andhra Pradesh

రావత్‌కు ఎమ్మెల్యేలంటే లెక్కే లేదు.. నాతో జాగ్రత్తగా ఉండండి- ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

మసీదు నిర్మాణానికి ముఖ్యమంత్రి 15 కోట్లు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపారని.. కానీ ఆ ఫైల్ ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ వద్ద ఆగిపోయిందన్నారు.

రావత్‌కు ఎమ్మెల్యేలంటే లెక్కే లేదు.. నాతో జాగ్రత్తగా ఉండండి- ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
X

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కొందరు అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారని కోటంరెడ్డి ఫైర్ అయ్యారు. ఏ పని జరగడం లేదన్నారు. ఐఏఎస్‌లు కొందరు విషయ పరిజ్ఞానం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదన్నారు.

సీఎం అనుమతి ఇచ్చినా అధికారులు మాత్రం కరుణించడం లేదన్నారు. 10 రూపాయలు అడిగితే 10 పైసలు ఇస్తున్నారని విమర్శించారు. అంత తక్కువ నిధులతో పనులు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. రూపాయి ఇవ్వాల్సిన చోట 10 పైసలు ఇచ్చినా పనులు చేసేందుకు కాంట్రాక్టులు సిద్ధమంటున్నారని.. కానీ 10 రూపాయలకు 10 పైసలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.

మసీదు నిర్మాణానికి ముఖ్యమంత్రి 15 కోట్లు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపారని.. కానీ ఆ ఫైల్ ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ వద్ద ఆగిపోయిందన్నారు. సీఎంవోలో ఎవరిని కలిసినా పని జరగడం లేదన్నారు. నెల్లూరులో రోడ్లు దారుణంగా ఉన్నాయని గతేడాది డిసెంబర్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లానని.. త్వరలోనే వేసేస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఈ ఏడాది డిసెంబర్‌ కూడా వెళ్లిపోతోందన్నారు. ఐదు కోట్ల రూపాయల పనులు చేసే పరిస్థితి కూడా లేకపోతే ఎలా అని ఎమ్మెల్యే నిలదీశారు.

40వేల ఎకరాలకు నీరందించే కెనాల్‌ డీప్‌కట్ నిర్మాణం కోసం ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం లేదని.. దీనిపై మాట్లాడేందుకు తాను రావత్‌ను కలిస్తే ఆయన చాలా నిర్లక్ష్యంగా స్పందించారని ఎమ్మెల్యే విమర్శించారు. చాంబర్‌లోకి వెళ్తే కనీసం కూర్చోండి అని కూడా అనలేదన్నారు. చివరకు తానే చైర్‌ లాగి కూర్చున్నానని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను అయినప్పటికీ కనీసం పలకరించకుండా కంప్యూటర్‌ ఆన్ చేసి అటు వైపు చూస్తూ ఉండిపోయారన్నారు. ఓ 15 నిమిషాల తర్వాత తానే సర్‌ అని పలకరిస్తే తన వైపు చూసిన రావత్.. తాను చెప్పిందంతా విని తిరిగి కంప్యూటర్‌ వైపు మళ్లారని కోటంరెడ్డి చెప్పారు.

కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. రావత్‌కు ఎమ్మెల్యేలంటే లెక్కే లేదన్నారు. అందరు ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటారని అనుకోవద్దని.. తన లాంటి ఎమ్మెల్యేలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజాసమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాలకు తాను వెనుకాడబోనన్నారు. సీఎం సంతకం పెట్టిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వకపోవడం బట్టే ఆర్థిక శాఖ అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నెల్లూరు జిల్లా స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలోనే వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇలా విరుచుకుపడ్డారు.

First Published:  24 Dec 2022 8:24 AM IST
Next Story