Telugu Global
Andhra Pradesh

ఆరోజు నీ కుమారుడు ఎక్క‌డున్నాడు సజ్జల..?

వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేలాదిమంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పోరాటం చేసి కేసులు కూడా పెట్టించుకున్నారని.. ఆరోజు ఇదే సజ్జల రామ‌కృష్ణారెడ్డి కొడుకు స‌జ్జ‌ల‌ భార్గవ్ రెడ్డి ఎక్కడ ఉన్నారని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు.

ఆరోజు నీ కుమారుడు ఎక్క‌డున్నాడు సజ్జల..?
X

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ల‌ను టార్గెట్ చేశారు.

కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చారు శ్రీధర్ రెడ్డి. తాను నిజంగా అధికారం కోసం పాకులాడే వ్యక్తిని అయి ఉంటే వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టిడిపిలోకి వెళ్లి ఉండేవాన్ని, ఐదేళ్లపాటు అధికారాన్ని అనుభవించి ఉండేవాడినని అనిల్ కుమార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

తాను వైసీపీకి దూరంగా జరగడం జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేయడం అయితే.. మరి ఇదే అనిల్ కుమార్ యాదవ్ ను తొలుత కార్పొరేటర్ ను చేసింది ఆనం వివేకానంద రెడ్డి కాదా..? .. 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది ఆనం కుటుంబం కాదా అని అనిల్ ను నిలదీశారు. నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేసినప్పుడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసింది ఇదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు .

తాను తప్పు చేసి ఉంటే తనకు శిక్ష పడాలని కోరుకోవాలి కానీ, తన బిడ్డలు ఏం పాపం చేశారని, వారు కూడా నాశనం అయిపోతారంటూ ఎందుకు శాపనార్థాలు పెట్టావు అని ప్రశ్నించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నా భుజస్కందాలపై వేసుకొని, వయసులో చిన్నవాడివైనప్పటికీ అనిల్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించింది ఇదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు.

నీకు మంత్రి పదవి వచ్చినప్పుడు జిల్లాలోని ఏ ఎమ్మెల్యే స్వాగతించకపోయినా ఇదే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎదురు వచ్చి స్వాగతం పలికిన విషయం మర్చిపోయావా అని ప్ర‌శ్నించారు. కార్పొరేటర్ గా గెలిపించి, 2009 ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కూడా ఇప్పించిన ఇదే ఆనం వివేకానంద రెడ్డిని ఉద్దేశించి నీ ఇంటి మీదకు వస్తానంటూ మాట్లాడిన వ్యక్తివి నువ్వు అని విమర్శించారు. మరి అది నమ్మకద్రోహం కాదా అని ప్రశ్నించారు. తాను మోసం చేసే వ్యక్తిని అయితే ఆఖరి నిమిషం వరకు పార్టీలో ఉండి అప్పుడు బయటకు వచ్చి ఉండేవాడినని, కేవలం అనుమానించిన చోట ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇంకా 15 నెలలు అధికారం ఉన్నా వదులుకొని వచ్చిన వ్యక్తిత్వం తనదని చెప్పారు.

తాను డిసెంబర్ 25న నీలి బెంజ్ కారులో వెళ్లి చంద్రబాబును కలిసినట్లు సాక్షి పత్రికలో వార్త వచ్చిందని అది పూర్తి అవాస్తమని ఖండించారు. డిసెంబర్ 25 క్రిస్మస్ అని. ఆరోజు తాను అనేక చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ, భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు స్థానికంగానే గడిపానని గుర్తు చేశారు. సినిమా థియేటర్ల దగ్గర శ్రీధర్ రెడ్డి నెలకు 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ నిన్న ఒక ఆడియోను కూడా బయటకు వదిలారని, ఇలాంటి తలా తోకలేని తిక్క పనులు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులే చేయిస్తారని శ్రీధర్ రెడ్డి విమర్శించారు.

అమెరికా అధ్యక్షుడుకే సలహాలు ఇచ్చేంత రేంజ్ ఉన్న ది గ్రేట్ సజ్జల రామకృష్ణారెడ్డి.. మన ప్రభుత్వం వచ్చాక ఇక సినిమా థియేటర్లు నడపలేము.. కళ్యాణ మండపాలుగా మార్చుకుంటామంటూ వేడుకున్న థియేటర్ల యాజమాన్యాలు ఇక నెలకు రెండు లక్షల రూపాయలు తనకు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాయని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి దమ్ముంటే ఈ రాష్ట్రంలో మద్యం, ఇసుక రూపంలో వేలకోట్ల రూపాయలు ఎవరి జేబులోనికి వెళ్తున్నాయో బయటకు చెప్పాలని సవాల్ చేశారు.

అలా సురాసురులు, ఇసుకాసురుల మీద ఆడియోలు రిలీజ్ చేస్తే అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పదవి కూడా ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఈ సురాసురులకు ఈ రాష్ట్రంలో మంత్రులన్న, ఎమ్మెల్యేలన్న లెక్క లేకుండా పోయిందన్నారు. పది టన్నులు ఎత్తాల్సిన వాహనంలో 20 టన్నుల ఇసుకను ఎత్తుతూ రవాణా చేస్తున్నారని, దాంతో రోడ్లు ఎక్కడికక్కడ నాశనం అయిపోతున్నాయని శ్రీధర్ రెడ్డి చెప్పారు. అరెస్ట్ కు రంగం సిద్ధం అంటూ కొందరు లీకులు ఇస్తున్నారని.. ఎప్పుడైనా అరెస్టు చేసుకోండి అని సవాల్ చేశారు. ఈ లీకులు ఇస్తున్నది ముమ్మాటికి సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆరోపించారు.

వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేలాదిమంది సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పోరాటం చేసి కేసులు కూడా పెట్టించుకున్నారని.. ఆరోజు ఇదే సజ్జల రామ‌కృష్ణారెడ్డి కొడుకు స‌జ్జ‌ల‌ భార్గవ్ రెడ్డి ఎక్కడ ఉన్నారని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. అసలు ఎవరూ లేరు అన్నట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ పదవి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడికే ఇప్పించుకున్నారని విమర్శించారు.

తనను రాజీనామా చేయాలి అంటున్న వైసీపీ నాయకులు మరి టిడిపిలో గెలిచి వైసిపిలోనికి వచ్చిన ఎమ్మెల్యేల చేత ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు.

First Published:  3 Feb 2023 12:28 PM IST
Next Story