నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్‌చార్జ్‌గా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై వినూత్నంగా నిరసనలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఇన్‌చార్జ్‌గా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు సంచలనం సృష్టించారు. వాస్తవంగా వైసీపీ ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీతో విభేదించారు. అదే సమయంలో టీడీపీకి దగ్గర కావడం గమనించి వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే కోటంరెడ్డి వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావడంతో ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డిని టీడీపీలో చేర్పించి, ఇన్నాళ్లు రాజకీయాలు నడిపారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ఏకంగా టీడీపీ ఇన్‌చార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థి దశ నుంచే కోటంరెడ్డికి రాజకీయాలపై మక్కువ ఎక్కువ. ఏబీవీపీలో కూడా పనిచేశారు. కాంగ్రెస్‌లో చేరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఉంటూ యువజన కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగారు. వైఎస్ హఠాన్మరణంతో ఆయన తనయుడు జగన్ వెంట నడిచిన మొదటి కాంగ్రెస్ నేతగా, వైఎస్ కుటుంబానికి వీరవిధేయుడిగా కోటంరెడ్డికి మంచి పేరుంది.
వైసీపీ అభ్యర్థిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై వినూత్నంగా నిరసనలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. విపక్షంలో ఉన్నా, అధికారపక్షంలో ఉన్నా ప్రజల సమస్యల కోసం ఆందోళన బాట పడుతున్న కోటంరెడ్డి వైసీపీలో మంత్రి పదవి దక్కలేదనే అక్కసు ఉందని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో అధిష్టానంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి బయటపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కూడా చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. అంతకుముందే వైసీపీ అధినేత, సీఎం జగన్ మూడు రాజధానులకి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తే.. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో వచ్చిన అమరావతి ఉద్యమానికి కోటంరెడ్డి మద్దతు పలికారు.
వరుస ఘటనలతో వైసీపీ పెద్దలతో దూరం అయిన కోటంరెడ్డి టీడీపీకి దగ్గరయ్యారు. ఇటీవల నెల్లూరులో జరిగిన నారా లోకేష్ పాదయాత్రని కోటంరెడ్డి బ్రదర్స్ అంతా తామై నడిపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ అధినేత ఆ పార్టీ నెల్లూరు రూరల్ ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు.