నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలుకు.. - కొడాలి నాని
చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న లాయర్లకు ఇప్పటివరకు రూ. 35 కోట్లు ఫీజులు కట్టారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో బాధను తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు నేటి నుంచి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి ' అనే పేరుతో బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే భువనేశ్వరి చేపట్టిన బస్సు యాత్రపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లాడన్నారు. నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలని అనుకుంటే చంద్రబాబు జీవితంలో ఎప్పటికీ బయటకు రాలేడని విమర్శించారు.
చంద్రబాబు కుటుంబమంతా అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో, భువనేశ్వరి ఏ స్థాయిలో ఉన్నారో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు చంద్రబాబు ఆస్తి కేవలం రెండు ఎకరాలు మాత్రమేనని, ఇప్పుడు ఆయన ఆస్తి రూ. 2000 కోట్లు దాటిపోయిందని.. ఇది ఎలా సాధ్యమైందని కొడాలి నాని ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆయన తరఫున వాదించేందుకు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న లాయర్లకు ఇప్పటివరకు రూ. 35 కోట్లు ఫీజులు కట్టారన్నారు. 'నిజం గెలవాలి' యాత్ర నిర్వహణకు రూ. ఏడు కోట్లతో ప్రత్యేకంగా బస్సు రూపొందించారని.. కష్టపడి పొలం దున్నితే వచ్చిన డబ్బుతోనే ఈ యాత్ర చేపట్టారా..? అని కొడాలి నాని ప్రశ్నించారు.
ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే జన సున్నా పార్టీ పెట్టారని కొడాలి నాని విమర్శించారు. గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ తెరవెనుక టీడీపీకి మద్దతుగా నిలిచారని, ఇప్పుడు ఆ ముసుగు తొలగించారన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీకి పారిపోయి మరోసారి పప్పు అని నిరూపించుకున్నాడని విమర్శించారు.