వెన్నుపోట్లలో బావ బాటలో పురందేశ్వరి..
చంద్రబాబు పాలనలోనే ఇసుక దోపిడీ జరిగిందని, దానిపై ప్రస్తుతం కేసులు కూడా నడుస్తున్నాయని చెప్పారు. అందులో ఆమె లంచాలు తీసుకుని ఆ నాడు నోరు మెదపకుండా మిన్నకున్నారని ఆరోపించారు
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వెన్నుపోట్లలో బావ బాటలో నడుస్తున్నారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. గతంలో తండ్రికి వెన్నుపోటు పొడిచి బావకు వత్తాసు పలికారని, తిరిగి కాంగ్రెస్‌లో చేరి.. ఆపై సోనియాగాంధీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరారని, ఇప్పుడు బీజేపీకి వెన్నుపోటు పొడిచి టీడీపీకి లాభం చేకూర్చేలా పనిచేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పురందేశ్వరి తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతోందంటూ ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.
బాబు దోపిడీల్లో పురందేశ్వరికీ వాటా ఉంది..
చంద్రబాబు పాలనలోనే ఇసుక దోపిడీ జరిగిందని, దానిపై ప్రస్తుతం కేసులు కూడా నడుస్తున్నాయని చెప్పారు. అందులో ఆమె లంచాలు తీసుకుని ఆ నాడు నోరు మెదపకుండా మిన్నకున్నారని ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబు చేసిన దోపిడీల్లో ఆమెకు కూడా వాటా ఉందని తెలిపారు. బాబు పాలనలో ఇసుక నుంచి ప్రభుత్వానికి పైసా ఆదాయం రాలేదని, ఇప్పుడు ప్రభుత్వమే ఇసుక అమ్మడం వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని, అది ప్రజల సేవకు ఉపయోగపడుతోందని తెలిపారు.
బెయిల్ కోసం బాబు దొంగ వేషాలు
బెయిల్ కోసం చంద్రబాబు దొంగ వేషాల వేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. గతేడాదే ఆయన మాట్లాడుతూ.. ’నేను 25 ఏళ్ల యువకుడిగా పని చేస్తున్నా.. విజన్ 2050 నా ధ్యేయం’ అని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం ఎలాగైనా బెయిల్ దక్కించుకోవాలనే ఉద్దేశంతో దొంగ వేషాలు వేస్తున్నాడని విమర్శించారు. కొత్తగా కన్ను, పళ్లు, గుండెకు బొక్కలు పడ్డాయని, లివర్ పాడైందని, కిడ్నీ రాలిపోయిందని, బ్రెయిన్ దెబ్బతిందంటూ తప్పుడు అఫిడవిట్ ఇచ్చి కోర్టును తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.