రాసి పెట్టుకో పవన్.. మళ్లీ అదే రిపీట్ అవుద్ది. - కొడాలి కౌంటర్ వైరల్
పవన్ ను ఎన్నికల్లో వాడుకుని ఆ తర్వాత ఆయన పైనే టీడీపీ నాయకులు విమర్శలు చేయడంపై ఒక వీడియోను పోస్ట్ చేయగా.. ఆ వీడియో సెన్సేషన్ సృష్టిస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నాయకులపై వేసిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ 2014లో జనసేన స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన నిలకడ లేని రాజకీయం గురించి ఆయన పలు సందర్భాల్లో మాట్లాడిన మాటలను, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ను ఎన్నికల్లో వాడుకుని ఆ తర్వాత ఆయన పైనే టీడీపీ నాయకులు విమర్శలు చేయడంపై ఒక వీడియోను పోస్ట్ చేయగా.. ఆ వీడియో సెన్సేషన్ సృష్టిస్తోంది.
కొడాలి నాని పోస్ట్ చేసిన వీడియోలో.. 2014లో పవన్ కళ్యాణ్ తాను పార్టీ స్థాపించిన సమయంలో 'పదవీ కాంక్ష కోసం, అధికార కాంక్ష కోసం ఓట్లను చీల్చడం నాకు ఇష్టం లేదు.. వాళ్లను గౌరవించడం కోసమే ఎన్నికల్లో పోటీ చేయలేదు' అని అన్నారు.. కట్ చేస్తే.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులే పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడం వీడియోలో కనిపించింది. 'పవన్ మాతో ఉన్నాడు కాబట్టే పంచాయతీలు, జడ్పీటీసీలు గెలిచామా? ఊరికే వాడొచ్చి గెలిపించాడు.. వీడొచ్చి గెలిపించాడని అనొద్దు' అని చింతమనేని ప్రభాకర్ పవన్ ని వీడియోలో దూషించాడు.
#TDPJanasenaTogether pic.twitter.com/Fft3caY5xt
— Kodali Nani (@IamKodaliNani) September 17, 2023
అలాగే వివిధ సందర్భాల్లో బాలకృష్ణ, యామిని చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం నాని చేసిన పోస్ట్ లో కనిపించాయి. ఇక టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ పార్టీపై తీవ్ర దూషణలు చేశారు. టీడీపీ నాయకులు నా తల్లిని దూషించారు, కిరాయి మూకలతో నాపై దాడికి ప్రయత్నించారని పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం వీడియోలో కనిపిస్తుంది. మా సహకారం తీసుకొని గెలిచి ఇవాళ మమ్మల్నే తొక్కేయడానికి ప్రయత్నిస్తారా? తెలుగుదేశం పార్టీని సమూలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తన్ని తరిమేద్దాం.. మీరు వెన్నుపోటు పొడిస్తే పొడిపించుకోవడానికి నేను ఎన్టీఆర్ ను కాదని గుర్తుపెట్టుకోండి' అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగించడం వీడియోలో ఉంది.
ఇక వీడియో చివర్లో తెలుగుదేశం- జనసేన వచ్చే ఎన్నికల్లో కలసి వెళ్తాయి.. అని పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని జత చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియోను చూస్తే టీడీపీ, జనసేనలు తమ తమ అవసరాల కోసం.. ఏ విధంగా ఒకరిని మరొకరు వాడుకుంటాయో క్లియర్ గా కనిపిస్తుంది. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ ని కావాలనే ఆ పార్టీ దూరం చేసింది. ఇక ఇప్పుడు కూడా టీడీపీని గెలిపిస్తే 2014లో జరిగినట్లు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుద్ది.. అని నాని పవన్ కి వీడియో ద్వారా హితవు పలికారు.