Telugu Global
Andhra Pradesh

ఉత్తరాంధ్రలో తెలంగాణా మోడల్..?

ధర్మాన ప్రకటనకు కొనసాగింపుగా విశాఖజిల్లాలోని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కి ధర్మశ్రీ తన రాజీనామా లేఖను అందించారు.

ఉత్తరాంధ్రలో తెలంగాణా మోడల్..?
X

వైజాగ్ రాజధానిగా కార్యకలాపాలు మొదలుపెట్టాలనే డిమాండ్‌ బాగా ఊపందుకుంటోంది. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్‌తో అమరావతి జేఏసీ చేస్తున్న పాదయాత్రకు ఇది విరుగుడన్నమాట. ఉత్తరాంధ్ర ప్రజల్లో సెంటిమెంట్‌ను రగల్చటం కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రాజీనామాల పల్లవి ఎత్తుకున్నారు. మంత్రిగా రాజీనామా చేసి ఉద్యమం మొదలుపెట్టబోతున్నట్లు ధర్మాన ప్రసాదరావు ప్రకటించిన విషయం తెలిసిందే.

ధర్మాన ప్రకటనకు కొనసాగింపుగా విశాఖజిల్లాలోని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కి ధర్మశ్రీ తన రాజీనామా లేఖను అందించారు. వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కార్యకలాపాలు మొదలవ్వాలని, మూడు రాజధానులకు మద్దతుగా వైజాగ్ లో జేఏసీ అధ్వర్యంలో రౌంట్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యే ధ‌ర్మ‌శ్రీ రాజీనామా చేశారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ధర్మాన రాజీనామా ప్రకటన చేసినా, ధర్మశ్రీ రాజీనామా చేసినా అంతా తెలంగాణా మోడల్లోనే జరుగుతోంది. అప్పట్లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో భాగంగా కేంద్రం, రాష్ట్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అనుకున్నారు. దాంతో తెలంగాణా ప్రాంతంలోని మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు రాజీనామాలు చేశారు. తెలంగాణా కోసం ప్రజాప్రతినిధులు మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను కూడా వదిలేసుకున్నారనే సెంటిమెంటు జనాల్లోకి బాగా వెళ్ళింది. దాంతో జనాల్లో కూడా తెలంగాణా సెంటిమెంటు పెరిగిపోయింది.

ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టించాలనే వ్యూహంతో ఉత్తరాంధ్రలోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాల పల్లవి అందుకున్నారు. ధ‌ర్మాన క‌నుక రాజీనామా చేస్తే దానిప్రభావం ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల‌పై పడుతుంది. ఇప్పుడు ధర్మశ్రీ రాజీనామా చేసిన వెంటనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయడు రాజీనామాకు డిమాండ్లు మొదలయ్యాయి. మరికొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు క‌నుక రాజీనామాలు చేస్తే అటోమేటిగ్గా టీడీపీ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. దాంతో ఇపుడు అమరావతికి జై కొడుతున్న అచ్చెన్న లాంటి వాళ్ళకు ఇబ్బందులు తప్పవు. పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే సమయానికి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో.

First Published:  8 Oct 2022 12:28 PM IST
Next Story