Telugu Global
Andhra Pradesh

రోడ్ల దుస్థితిపై వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన.. వైరల్ అవుతున్న వీడియో..

రోడ్డు పక్కనే కారు ఆపి బూతు పురాణం మొదలుపెట్టారు. అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీలో రోడ్ల దుస్థితి మరోసారి చర్చనీయాంశమైంది.

రోడ్ల దుస్థితిపై వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన.. వైరల్ అవుతున్న వీడియో..
X

ఏపీలో రోడ్ల పరిస్థితిపై పక్క రాష్ట్రం నేతలు సెటైర్లు వేస్తున్నారంటూ ఆమధ్య ఉడుక్కున్నారు వైసీపీ నేతలు. మీ సంగతి మీరు చూస్కోండి అంటూ కాస్త వెటకారంగా మాట్లాడారు. పక్క రాష్ట్రం నేతలదాకా ఎందుకు ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే రోడ్ల దుస్థితిపై బూతులు తిడుతున్నారు. మా - మాకు - స్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఫోన్లో అధికారితో మాట్లాడిన బూతులు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ధర్మశ్రీ నియోజకవర్గం చోడవరంలోనే కాదు, ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే దుస్థితి. సంక్షేమ పథకాలకు ఠంచనుగా నిధులు విడుదల చేస్తున్నారు కానీ, రోడ్ల మరమ్మతుల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి లాభమా, నష్టమా అనేది ముందు ముందు తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు మాత్రం అధ్వాన్నపు రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ప్రమాదాల సంఖ్య పెరిగింది, గుంతల్లో బండ్లు దిగబడిపోతున్నాయి. చోడవరం నియోజకవర్గంలో కూడా ఇలాంటి రోడ్లు చాలానే ఉన్నాయి. వాటికి మరమ్మతులు జరగకపోవడంతో స్థానికుల నుంచి ఎమ్మెల్యే ధర్మశ్రీకి నిరసన ఎదురైంది. కాంట్రాక్టర్‌కి ఫోన్ చేసినా ఫలితం లేదు. రోడ్లపై గుంతలు పూడిస్తే డబ్బులు రావని, అందుకే పూర్తిగా రోడ్డు వేసేందుకు అనుమతి వస్తేనే తాము ముందుకొస్తామని తెగేసి చెప్పేశారు. అటు అధికారులేమో కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదంటున్నారు. ఈ దశలో ఎమ్మెల్యే ధర్మశ్రీకి కోపం నషాళానికి అంటింది. రోడ్డు పక్కనే కారు ఆపి బూతుపురాణం మొదలుపెట్టారు. అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీలో రోడ్ల దుస్థితి మరోసారి చర్చనీయాంశమైంది.

ఇటీవల విశాఖ రాజధాని కావాలంటూ రాజీనామా చేశారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. రాజధాని కోసం కాదయ్యా, రోడ్లు వేయించలేనందుకు సిగ్గుపడి రాజీనామా చేసెయ్ అంటూ ఇప్పుడు ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి, రాజధానికి ముడిపెట్టి ఎన్నాళ్లు నాటకాలాడతారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. రాజధాని సంగతి తర్వాత ముందు ఉత్తరాంధ్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తమ్మీద ఇటీవల రాజీనామాతో ఉత్తరాంధ్రలో కాస్తో కూస్తో మైలేజ్ పెంచుకున్న ధర్మశ్రీ, ఇప్పుడు గుంతల రోడ్ల గురించి బూతులు మాట్లాడి సోషల్ మీడియాలో అందరికీ టార్గెట్ అయ్యారు.

First Published:  21 Oct 2022 3:10 AM GMT
Next Story