Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు అనుమానాస్పద మృతి

అప్పుడప్పుడు అవంతి అపార్ట్‌మెంట్‌లో ఉన్న 101 నెంబర్ ఫ్లాట్‌కు వచ్చి ఉంటుంటారు. మూడు రోజుల కిందటే అక్కడకు వచ్చిన మంజునాథరెడ్డి.. శుక్రవారం మృతి చెందినట్లు తెలుస్తున్నది.

వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు అనుమానాస్పద మృతి
X

వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన సంభవించింది. కాంట్రాక్టర్ అయిన మంజునాథరెడ్డి అప్పుడప్పుడు అవంతి అపార్ట్‌మెంట్‌లో ఉన్న 101 నెంబర్ ఫ్లాట్‌కు వచ్చి ఉంటుంటారు. మూడు రోజుల కిందటే అక్కడకు వచ్చిన మంజునాథరెడ్డి.. శుక్రవారం మృతి చెందినట్లు తెలుస్తున్నది. మంజునాథరెడ్డి సహాయకుడిగా నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. అవంతి అపార్ట్‌మెంట్‌కు ఎప్పుడు వచ్చినా.. ఆయన బాధ్యతలు అన్నీ నరేంద్ర రెడ్డి చూస్తుంటారు.

శుక్రవారం సాయంత్రం నరేంద్రరెడ్డి 5.30 గంటల సమయంలో ఫ్లాట్‌కు వచ్చినట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత కాసేపటికే మంజునాథరెడ్డి కింద పడిపోయారని అపార్ట్‌మెంట్ వాళ్లకు చెప్పాడు. అంబులెన్సులోకి ఎక్కించడానికి వారంతా సాయం చేశారు. అయితే అప్పటికి మంజునాథరెడ్డి ప్రాణం ఉందా.. లేదా అనే విషయం మాత్రం స్థానికులు చెప్పలేకపోతున్నారు. నరేంద్ర రెడ్డి మాత్రం.. తాను వచ్చే సరికి ఫ్లాట్ కిటికీలన్నీ మూసి ఉన్నాయి.. లోపలే గొళ్లెం పెట్టుకొని మంజునాథరెడ్డి ఉన్నారని చెప్పాడు. కిటికీ ఎక్కి తలుపు తెరిచామ‌ని.. లోపలకి వెళ్లి చూడగా ఆయన మంచం పక్కన పడిపోయి కనిపించాడని నరేంద్ర రెడ్డి చెబుతున్నాడు.

ప్రస్తుతం మంజునాథరెడ్డి మృతదేహాన్ని మణిపాల్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం హసనాపురం పంచాయతీ పరిధిలోని పప్పిరెడ్డిగారి పల్లె మంజునాథరెడ్డి స్వగ్రామం. ఆయన తండ్రి మహేశ్వరరెడ్డి కూడా వైసీపీలో ఉన్నారు. పీఎంఆర్ కన్‌స్ట్రక్షన్ అనే సంస్థను మహేశ్వరరెడ్డి నిర్వహిస్తున్నారు. కొడుకు మరణ వార్త తెలుసుకొని ఆయన వెంటనే గుంటూరు బయలుదేరి వచ్చారు. మంజునాథరెడ్డి భార్య స్రవంతి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా, మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.

కాగా, మంజునాథరెడ్డి కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తండ్రి చెబుతున్నారు. కశ్మీర్‌తో పాటు పలు ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు రాంకీ సంస్థ నుంచి రావల్సి ఉందని, ఇక బ్యాంకు నుంచి రావల్సిన ఫైనాన్స్ కూడా పెండింగ్‌లో ఉండి ఆలస్యం అయ్యిందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన పూర్తి ఒత్తిడిలో ఉన్నాడని.. అయితే ఎలా చనిపోయాడనే విషయం తనకు తెలియదని అన్నారు. కేవలం కొడుకు చనిపోయాడనే వార్త మాత్రం తెలుసుకొని వచ్చానని అన్నాడు. కాగా, పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  20 Aug 2022 7:48 AM IST
Next Story